ఏపీ అసెంబ్లీ మూడో రోజు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు. తొలి రెండు రోజులు సభకు హాజరుకాని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మూడో రోజు అసెంబ్లీకి వచ్చారు. బాలయ్య అసెంబ్లీ లాబీల్లో మంత్రులతో సరదాగా మాట్లాడారు. లాబీల్లో బాలయ్యను మంత్రులు బొత్స, అంబటి , గుడివాడ అమర్నాథ్‌లు పలకరించారు.
'ఏం హీరో గారు' అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ బాలయ్యకు బొత్స అభివాదం చేశారు. తర్వాత ఇవాళ కోటు వేసుకు రాలేదేంటంటూ మంత్రి అమర్నాథ్‌ను ఉద్దేశించి బాలయ్య చమత్కరించారు. ఇలా నందమూరి హీరో మంత్రులు, ఎమ్మెల్యేలతో సరదాగా మాట్లాడారు. అసెంబ్లీ లాబీల్లో సందడి వాతావరణం కనిపించింది. బాలయ్య అంతకముందు టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి నిరసనల్లో పాల్గొన్నారు. అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చి జగన్ కల కల ప్రజలు గిల గిల అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. మొత్తానికి బాలయ్య రాక మరింత సందడి నింపింది. అయితే బాలయ్య సభకు వచ్చిన కొద్దిసేపటికే ఒక్కరోజు సస్పెండ్ అయ్యారు.
మంత్రి బుగ్గన బడ్జెట్ ప్రసంగం మొదలు పెట్టగానే స్పీకర్ పోడియంపై పేపర్లు విసిరారు. టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని స్పీకర్‌కు సిఫార్సు చేశారు. టీడీపీ సభ్యులు తమ స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్ వారించినా వినలేదు.. బడ్జెట్ ప్రసంగానికి అడ్డు తగలడంతో తమ్మినేని సీతారాం చర్యలు తీసుకున్నారు. 14 మంది టీడీపీ సభ్యులను ఒక్కరోజు సస్పెండ్ చేశారు.