రాజకీయాలలో ప్రతి చర్యలకు ఓ హద్దు ఉంటుంది. కానీ ఏపీలో రాజకీయాలు మాత్రం అందుకు భిన్నంగా సాగుతున్నాయి. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో.. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నాయి. ఈ క్రమంలో అమాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వీరికి సపోర్ట్ చేస్తే.. వారికి కోపం.. వారికి సపోర్ట్ చేస్తే.. వీరికి కోపం అన్నట్టు మారింది పరిస్థితి. దీంతో అటు అధికారులు, ఇటు సామాన్య ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. తాజాగా.. మాచర్ల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
'ఐదారు నెలల కిందట నేను నిదానంపాడు అమ్మవారి గుడికి వెళ్లాను. అక్కడి పూజారి నా కోసం ఏవో పూజలు చేశారు. నాకు పూజలు చేశాడని.. ఆ పూజారిని సస్పెండ్ చేశారు. వీటిని చిల్లర రాజకీయాలు అనక ఇంకా ఏమంటారు. గుడికి వెళ్లిన ప్రతివాడికి పూజారి ఆశీర్వాదం ఇవ్వాల్సిందే కదా. బ్రహ్మారెడ్డి కాదు.. బయటివాడు వస్తాడు. హైదరాబాద్ వాడు రావొచ్చు.. బెంగళూరు వాడు రావొచ్చు. తెలుగోడు రావొచ్చు.. తమిళోడు రావొచ్చు. చివరికి ఆ పూజారిని కూడా హింసించే పరిస్థితి అంటే.. ఎంత దారుణంగా ఉంది వ్యవస్థ' అని జూలకంటి బ్రహ్మారెడ్డి వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. ఆఖరికి మీడియాకి కూడా పల్నాడు ప్రాంతంలో స్వేచ్ఛ లేదని జూలకంటి ఆరోపించారు. కేబుల్ సంస్థలను కూడా కబ్జా చేస్తున్నారని.. దౌర్జన్యంగా లాక్కుంటున్నారని ఆరోపించారు. కొన్ని రోజులుగా పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి (Pinnelli Ramakrishna Reddy) , జూలకంటి బ్రహ్మారెడ్డి మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. అదికాస్త పలుచోట్ల తీవ్ర చర్యలకు దారి తీస్తోంది. దాడులు, హత్యల వరకు రాజకీయం వెళ్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే.. ఇక ఎన్నికల సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో అని అక్కడి ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.