వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర యువత ఎక్కువ నష్టపోయిందని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ పేరిట యువతను మోసం చేశారని ధ్వజమెత్తారు. నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర 44వ రోజు గురువారం అన్నమయ్య జిల్లా మద్దయ్యగారిపల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడి యువతతో నారా లోకేష్ ముఖాముఖిగా మాట్లాడారు. ఈ సందర్భంగా యువత అడిగిన ప్రశ్నలకు, సందేహాలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. టీడీపీ హయాంలో జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా రాష్ట్రం ఉండేదని.. ఇప్పుడు గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిందని లోకేష్ ఆరోపించారు.
జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పరిశ్రమనైనా చూపించాలని లోకేష్ సవాల్ విసిరారు. టీడీపీ తెచ్చిన కంపెనీలకు రిబ్బన్ కటింగ్ చేయడం తప్ప.. రాష్ట్రంలో వైసీపీ తెచ్చిన కంపెనీ ఒక్కటి కూడా లేదన్నారు. యువతను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని, జగన్‌రెడ్డి పాలనలో ఎక్కువగా నష్టపోయింది యువతేనని పేర్కొన్నారు. మాజీ సీఎం చంద్రబాబు పాలనలో ఉద్యోగాలకు ఏపీ రాజధానిగా ఉండేదని.. జగన్ పాలనలో గంజాయికి క్యాపిటల్‌గా ఏపీ మారిందని తీవ్ర ఆరోపణలు చేశారు. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని మోసం చేశారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రతి సంవత్సరం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని లోకేష్ ప్రకటించారు.
ఇక, వైసీపీ అరాచకాల వల్లే ఏపీకి పరిశ్రమలు రావట్లేదని లోకేష్ తెలిపారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు. తంబళ్లపల్లెకి కంపెనీలు రావాలంటే పెద్దిరెడ్డి ఫ్యామిలీకి బై బై చెప్పాలన్నారు. సీఎం జగన్ అంటే జైలు.. బాబు అంటే బ్రాండ్ అని చెప్పారు. జైలుకెళ్లిన ఆర్థిక ఉగ్రవాదిని చూసి పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఇక, కోడిగుడ్డు మంత్రిని చూసి పారిశ్రామికవేత్తలు ఎలా వస్తారని లోకేష్ అన్నారు.