మరణించినట్టు చిత్రీకరించి కటకటాల పాలయ్యాడు
ఎన్ని చేసినా చట్టం ముందు ఏదో ఒక రోజు పట్టుబడాల్సిందే. అలాంటి ఘటనకు ఉదాహరణ ఈ సంఘటన వ్యాపారంలో లక్షల్లో నష్టం మూటగట్టుకున్నాడు. బయటపడే మార్గం కనిపించలేదు. దీంతో కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న బీమా సొమ్మును రాబట్టుకుని వాటితో అప్పులు తీర్చాలని భావించాడు. ఇందుకోసం భయంకరమైన నాటకం ఆడాడు. అయితే, పోలీసుల ముందు అతడి ప్లాన్ పారలేదు. ఇప్పుడు తీరిగ్గా కటకటాలు లెక్కపెట్టుకుంటున్నాడు.
చత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాకు చెందిన సమీరన్ సిక్దార్ (29) వ్యాపారంలో లక్షల్లో నష్టపోయాడు. దీంతో తన కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న రూ. 75 లక్షల బీమా సొమ్మును రాబట్టుకోవడం ద్వారా అప్పులు తీర్చాలని భావించాడు. అందుకోసం భారీ ప్రణాళిక రచించాడు. ఈ నెల 1న భార్య జయ, కుమారుడు దీప్, కుమార్తె కృతికతో కలిసి కారులో కాంకేర్ నుంచి ధామ్‌తరి చేరుకున్నాడు. అక్కడ ఓ లాడ్జీలో దిగాడు. అనంతరం అదే కారులో కాంకేర్‌లోని చావాడీ గ్రామ సమీపంలోకి వెళ్లి కారుతో చెట్టును ఢీకొట్టాడు. తర్వాత దానికి నిప్పు పెట్టాడు. ఈ ప్రమాదంలో తనతోపాటు భార్య, పిల్లలు మరణించినట్టు నమ్మించే ప్రయత్నం చేశాడు.
ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అందులో భాగంగా 1000కిపైగా సీసీటీవీ దృశ్యాలు, 45 వేల ఫోన్ నంబర్లను పరిశీలించారు. దీంతో సమీరన్, అతడి భార్యాపిల్లలు బతికే ఉన్నట్టు పోలీసులు ఓ అంచనాకొచ్చారు. తన ప్లాన్ పోలీసులకు తెలిసిపోయిందని గ్రహించిన సమీరన్ ఈ నెల 13న ఇంటికి చేరుకున్నాడు. అక్కడ అప్పటికే కాపుకాసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కి పంపారు.