మధ్యప్రదేశ్‌లో గిరిజన మహిళ హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్ ఎదుట చేపట్టిన ఆందోళనలు హింసకు దారితీసింది. ఆగ్రహంతో రగిలిపోయిన బాధిత మహిళ కుటుంసభ్యులు, గ్రామస్థులు పోలీసులపైకి రాళ్లు రువ్వి, వాహనాలకు నిప్పంటించారు. ఈ ఘటనలో ఓ ఇన్‌స్పెక్టర్ సహా 13 పోలీసులు గాయపడ్డారు. ఇండోర్ జిల్లా మౌ సమీపంలోని బడగొండ పోలీస్ స్టేషన్‌లో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బడగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఓ 23 ఏళ్ల గిరిజన యువతి అనుమానాస్పదంగా మృతిచెందింది. ఆమె మృతదేహాంతో పోలీస్ స్టేషన్‌కు వచ్చిన కుటుంబసభ్యులు, గ్రామస్థులు.. రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు.
గ్రామంలోని పాటీదార్ సామాజిక వర్గానికి చెందిన ఓ యువకుడు తమ కుమార్తెను అపహరించి, సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేశారని బాధిత యువతి కుటుంబం ఆరోపించింది. యువతి గత కొన్నేళ్లుగా ధమనోడ్‌లో ఉంటూ చదువుకుంటోంది. యుదునందన్ పాటీదార్ అనే యువకుడు తమ కుమార్తెను ధమనోడ్‌లో కిడ్నాప్ చేసి స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన అనంతరం చంపేశాడని యువతి తండ్రి ఆరోపించారు. పోలీస్ స్టేషన్‌కు భారీగా చేరుకున్న గ్రామస్థులు.. నేరస్థులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో పోలీసులు వారిని వారించే ప్రయత్నం చేయగా.. ఆగ్రహంతో ఊగిపోయారు. పోలీసులపై రాళ్లు రువ్వి, అక్కడ వాహనాలకు నిప్పంటించారు. దీంతో వారిని చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి, గాల్లోకి కాల్పులు జరిపినట్టు పోలీస్ స్టేషన్ ఇంఛార్జి ధర్మేంద్ర ఠాకూర్ చెప్పారు. ఈ ఘటనలో ఓ గిరిజన యువకుడు చనిపోయినట్టు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గేవరకూ భారీ భద్రతను ఏర్పాటుచేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.
ఇదిలావుంటే ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా ఆదేశించారు. బాధిత కుటుంబాన్ని కలిసిన ఆయన.. వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అటు, ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ ఘటనపై విమర్శలు గుప్పించింది. ‘గిరిజన యువతి హత్యాచారం, పోలీసుల కాల్పుల్లో యువకుడు మృతి తీవ్ర విచారకరం.. ఇది రాష్ట్రంలో ఉన్న ఆటవిక పాలనకు ఉదాహరణ’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్ నాథ్ ధ్వజమెత్తారు.