ఇంటర్ పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ విద్యార్థినికి అకస్మాత్తుగా పురిటినొప్పులు వచ్చాయి. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏపీలో ఇంటర్ పరీక్షలు బుధవారం (మార్చి 15) నుంచి ప్రారంభమయ్యాయి. పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో కొత్తవలసకు చెందిన ఓ వివాహిత (22 ఏళ్లు) ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష రాసేందుకు వచ్చారు. ఆమె 9 నెలల నిండు గర్భిణీ. అయినప్పటికీ, పరీక్ష రాయాలనే సంకల్పంతో వచ్చారు. పరీక్షా కేంద్రం వద్దకు రాగానే ఆమెకు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి.
విషయం తెలుసుకున్న కాలేజీ ప్రిన్సిపాల్ వెంటనే 108కి కాల్ చేశారు. అంబులెన్స్ ద్వారా ఆమెను పార్వతీపురం జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు. ఆమె వెటర్నరీ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందుకోసం ఇంటర్ క్వాలిఫై అవసరం తప్పనిసరి అని, ఈ పరీక్షలు తనకు చాలా ముఖ్యమని ఆమె భర్త తెలిపారు. అందుకే నెలలు నిండిన తర్వాత కూడా పరీక్షా కేంద్రానికి తీసుకొచ్చినట్లు ఆయన చెప్పారు.