గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా ఈ ఆసుపత్రి వైద్యులపై ఆరోపణలు వచ్చాయి. తాజాగా.. న్యూరాలజీ సమస్యలతో బాధపడుతున్న యువకుడికి వైద్యం చేయడంలో డాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని.. బాధిత యువకుడు ఆరోపించారు. తన ప్రాణాలు కాపాడాలని.. తనకు సాయం చేయాలని సెల్ఫీ వీడియో ద్వారా వేడుకున్నాడు. బాధితుడు విడుదల చేసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
'10 రోజుల కిందట జాయిన్ అయ్యాను. నాకు నాలుగు రోజులు నుంచి చికిత్స చేయడం లేదు. మెడిసిన్ లేదు. రావాలి అంటున్నారు. మందుల గురించి ప్రశ్నిస్తే.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బయటకు వెళ్లి వైద్యం చేయించుకునే స్థోమత నాకు లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నాకు ట్రీట్‌మెంట్ జరిగేలా చూడాలి. దీని గురించి RMO దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేదు. ప్రస్తుతం నేను కూర్చుంటే తిరిగి లేచే పరిస్థితిలో కూడా లేను' అని బాధితుడు మల్లికార్జున వీడియో విడుదల చేశాడు.