కొందరు పోలీసు అధికార్ల తీరుతో ఆశాఖకే మచ్చ ఏర్పడుతుంది. తిరుపతి జిల్లా వరదయ్యపాళెంలో ఎస్సై రెచ్చిపోయాడు. ఇంటర్మీయట్ పరీక్ష కేంద్రానికి కాస్త ఆలస్యంగా వచ్చిన విద్యార్థిపై తన ప్రతాపం చూపించారు. హాల్ టికెట్ మరిచిపోయి వచ్చిన విద్యార్థిపై ఎస్సై నాగార్జున్ రెడ్డి చేయిచేసుకున్నారు. విద్యార్థిని ఎస్సై కొట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వరదయ్యపాళెంలో పరీక్షా కేంద్రం వద్ధ ఎస్ఐ నాగార్జున్ రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. అప్పుడు ఓ విద్యార్థి పరిగెత్తుకుంటూ అక్కడి వచ్చాడు. ఆలస్యంగా వచ్చిన ఆ విద్యార్థి తొందరలో.. హాల్ టికెట్ మర్చిపోయాడు.
అతన్ని అక్కడి సిబ్బంది వివరాలు అడుగుతుండగానే.. ఎస్సై నాగార్జున రెడ్డి విద్యార్థి దగ్గరకు వచ్చారు. హాల్ టికెట్ ఏదిరా.. అంటూ రెచ్చిపోయి విద్యార్థిపై చేయిచేసుకున్నారు. దీంతో సిబ్బంది తాము హాల్ టికెట్ ఇస్తామని అతన్ని లోపలికి పంపించారు. అయితే.. ఎస్సై విద్యార్థిని కొట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హాల్ టికెట్ విషయంలో ఏమైనా అడగాల్సి వస్తే.. పరీక్షా కేంద్రం అధికారులు అడగాలి.. ఏమైనా చర్యలు తీసుకోవాలంటే.. వారు తీసుకోవాలి. కానీ.. ఎస్సైకి హాల్ టికెట్ గురించి ఏం అవసరం అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వారి చర్యల వల్ల పోలీస్ వ్యవస్థకు చెడ్డపేరు వస్తోందని అంటున్నారు. ఎస్సై విద్యార్థిని కొట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.