ఏపీ రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. రాష్ట్రంలోని చాలాచోట్ల గురువారం మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచనలు చేసింది. మరో మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఐఎండీ అంచనా ప్రకారం.. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదగా కొంకణ్ తీరం వరకు ద్రోణి ఏర్పడిందని వెల్లడించింది. సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని విపత్తుల నిర్వాహణ సంస్థ తెలిపింది.
ఈ ద్రోణి ప్రభావంతో.. రాబోయే మూడు రోజులపాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడే అవకాశం కూడా ఉందని తెలిపింది. భారీ వర్షాలు, పిడిగులు పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో.. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అల్లూరి జిల్లా అరకులోయలో భారీ వర్షం కురిసింది. గంటకు పైగా ఉరుములతో భారీ వర్షం కురిసింది. స్థానికులు, పర్యాటకులు వర్షానికి సేద తీరారు.
శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని.. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. శనివారం రోజున శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
ఇటు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఆదివారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. పల్నాడు జిల్లా నాగార్జునసాగర్ విజయపూరి సౌత్ చింతలతండాకు చెందిన గొర్రెల కాపరి.. గొర్రెలను మేపుతుండగా.. ఉరుములతో కూడిన అకాల వర్షం కురిసింది. పిడుగుపడి గొర్రెలు కాపరి రామవత్ సైదా మృతిచెందారు. 30 గొర్రెలు కూడా అక్కడికి అక్కడే మృతిచెందాయి.