ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానమని, దీనిని ప్రజలే మార్చాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి. ఆదినారాయణ అన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కూర్మన్నపాలెంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం నాటికి 763వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని ముక్కలుగా చేసి అదానీ, అంబానీలకు అప్పగించేందుకే బీజేపీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ప్రజలంతా కేంద్ర ప్రభుత్వ విధానాలను గమనిస్తున్నారని, సరైన సమయంలో తమ ఓటు ద్వారా తగిన బుద్ధి చెబుతారన్నారు. కమిటీ నాయకుడు ఎన్. రామారావు మాట్లాడుతూ దేశ సంపదను పరిరక్షించుకునేందుకు కార్మికులంతా తమ పోరాటాలను ఉధృతం చేయాలన్నారు. స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు అవసరమన్నారు. ఉక్కు ఉద్యమంలో ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, మహిళలు, యువత భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు వరసాల శ్రీనివాసరావు, జె. అయోధ్యరామ్, సంపూర్ణం, నరేంద్ర, జి. ఆనంద్, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.