ఢిల్లీ రాజకీయాలలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకొంది. కొద్ది రోజులుగా ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న ఢిల్లీ మద్యం కుంభకోణంపై ఈడీ, సీబీఐల దర్యాప్తునకు లెఫ్టినెంట్ గవర్నర్ చేసిన ఆరోపణలే కారణం. విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేలా శిక్షణ నిమిత్తం టీచర్లను విదేశాలకు పంపే అంశం మొదలు మేయర్ ఎన్నిక వంటి విషయాల్లోనూ కేజ్రీవాల్ సర్కారు, ఎల్జీకి మధ్య వివాదం కొనసాగింది. ఈ క్రమంలో తమను ప్రశ్నించడానికి అసలు ఎల్జీ ఎవరంటూ సీఎం కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వంపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రశంసలు కురిపించడం గమనార్హం.
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై ఆమ్ ఆద్మీ ప్రభుత్వం దృష్టి సారించడం వల్లే ఢిల్లీ విద్యార్థులు చదువులో రాణిస్తున్నారని ఎల్జీ ప్రశంసించారు. ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీలో ప్రసంగించిన లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. విద్య, వైద్య సదుపాయాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కితాబిచ్చారు. పాత వాటిని ఆధునీకరిస్తుండడంతోపాటు కొత్త ఆస్పత్రుల ద్వారా 16వేల పడకలు అందుబాటులోకి రానున్నాయని వివరించారు.
‘స్పెషలైజ్డ్ ఎక్సలెన్స్ ద్వారా ప్రపంచస్థాయి పాఠశాలలను విద్యార్థుల కోసం అందుబాటులోకి వచ్చాయి... మిషన్ బునియాద్ విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలలో గణనీయమైన మెరుగుదలకు దారితీసింది.. దాదాపు 20,000 కొత్త తరగతి గదులు నిర్మించడం వల్ల ఢిల్లీలో విద్యా మౌలిక సదుపాయాలు గణనీయమైన అభివృద్ధిని సాధించాయి’ అని వీకే సక్సేనా అన్నారు.
విద్య, వైద్య రంగాలను మరింత మార్పులు తెచ్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎల్జీ చెప్పారు. కాగా, కేజ్రీవాల్ ప్రభుత్వ పథకాలను లెఫ్టినెంట్ గవర్నర్ ప్రశంసిస్తుంటే.. ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు ప్రసంగానికి అడ్డుతగిలారు. మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటున్న ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను మార్షల్స్ స్పీకర్ సభ నుంచి బయటకు పంపించారు. దీనికి నిరసనగా బీజేపీ ఎమ్మెల్యేలంతా వాకౌట్ చేసి.. అసెంబ్లీ బయట ఆందోళనకు దిగారు.
ఇదిలావుంటే కేజ్రీవాల్ క్యాబినెట్‌లో విద్య, ఆరోగ్యశాఖ మంత్రులుగా ఉన్న మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్‌లు వివిధ కేసుల్లో అరెస్టై ప్రస్తుతం జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఆయా కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న వీరు ఇటీవలే తమ పదవులకు రాజీనామా చేశారు. వారిస్థానంలో కొత్త విద్యాశాఖ మంత్రిగా ఆతిశీ, ఆరోగ్యశాఖ మంత్రిగా సౌరభ్ భరద్వాజ్ ఇటీవల బాధ్యతలు చేపట్టారు. ఆతిశీ విద్యతోపాటు పీడబ్ల్యూడీ, విద్యుత్తు, పర్యాటకశాఖలను నిర్వహిస్తుండగా.. సౌరభ్ ఆరోగ్యంతోపాటు పట్టణాభివృద్ధి, జలవనరులు, పరిశ్రమలశాఖలను చూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa