పట్టభద్రుల ఎన్నికల కౌంటింగ్ చివరి దశలో పెద్ద ఎత్తున అక్రమాలకు వైసీపీ సిద్దమైందని ఎన్నికల అధికారికి టీడీపీ అధినేత చంద్రబాబు ఫిర్యాదు చేశారు. ఇదిలావుంటే చంద్రబాబు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై నిరంతర పర్యవేక్షిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో, నిబంధనల అమలు, అక్రమాల నివారణపై జిల్లా అధికారులకు, ఎన్నికల అధికారులకు చంద్రబాబు ఫోన్ చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎం.కే. మీనా, అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ, ఎస్పీ ఫకీరప్పలతో ఫోన్ లో మాట్లాడారు. అనంతపురం కౌంటింగ్ సెంటర్ లోకి ఎటువంటి పాసులు లేకుండా చొరబడి.. టీడీపీ వారిపై దాడులకు దిగిన వైసీపీ శ్రేణులపై తక్షణ చర్యలకు చంద్రబాబు డిమాండ్ చేశారు.
పట్టభద్రుల ఎన్నికల కౌంటింగ్ చివరి దశలో పెద్ద ఎత్తున అక్రమాలకు వైసీపీ సిద్దమైందని ప్రధాన ఎన్నికల అధికారి మీనాకు చంద్రబాబు ఫిర్యాదు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో లోపాలు లేకుండా, కౌంటింగ్ సెంటర్ల వద్ద నిబంధనలు పూర్తిగా అమలయ్యేలా చూడాలని అధికారులను చంద్రబాబు కోరారు. ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలు, ఎన్నిక బాధ్యులను చంద్రబాబు ఆదేశించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో అక్రమాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి చంద్రబాబు లేఖ రాశారు. కౌంటింగ్ సెంటర్స్‌లో భద్రత పెంచడంతో పాటు.. నిబంధనలు అమలు అయ్యేలా చూడాలని లేఖలో ప్రస్తావించారు. అనంతపురం కౌంటింగ్ సెంటర్ లో వైసీపీ రౌడీల చొరబాటు ఘటనను లేఖలో ప్రస్తావించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో అధికార వైఎస్సార్‌సీపీ అక్రమాలు, ఉల్లంఘనలకు పాల్పడుతోందన్నారు. వైఎస్సార్‌సీపీ మూకలు అక్రమ పద్దతుల ద్వారా పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తునారన్నారు.
అనంతపురంలో పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్‌ల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలకు ప్రయత్నించారన్నారు చంద్రబాబు. గురువారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో వైసీపీ గూండాలు ఎలాంటి పాసులు లేకుండా అక్రమంగా కౌంటింగ్ సెంటర్ లోకి వెళ్లి అలజడి సృష్టించారన్నారు. టీడీపీ కౌంటింగ్ ఏజెంట్లపై దాడి చేసి కౌంటింగ్ స్టేషన్‌లో గందరగోళం సృష్టించారని.. పోలీసులు రౌడీలను అరెస్టు చేయకుండా టీడీపీకి చెందిన కౌంటింగ్ ఏజెంట్ ధనంజయరెడ్డిని అరెస్టు చేశారని లేఖలో పేర్కొన్నారు.
ఓటమిని నుంచి బయటపడడానికి వైఎస్సార్‌సీపీ నేతలు కౌంటింగ్ స్టేషన్‌పై దాడికి పాల్పడ్డారని తెలుస్తోందన్నారు టీడీపీ అధినేత. ఎన్నికల్లో గెలుపొందేందుకు ఇలాంటి అక్రమాలు వైఎస్‌ఆర్‌సీపీ గూండాలకు అలవాటుగా మారాయని.. అధికార వైఎస్సార్‌సీపీ ఒత్తిడి కారణంగా ఎన్నికల సిబ్బంది చట్ట ప్రకారం విధులు నిర్వర్తించలేకపోతున్నారన్నారు. ఈ నేపథ్యంలో మూడు పట్టభద్రుల నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రాల్లో తక్షణమే భద్రతను పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల పరిశీలకులు కౌంటింగ్ ప్రక్రియలో చురుగ్గా పాల్గొనేలా చూడాలన్నారు.
టీడీపీ కౌంటింగ్ ఏజెంట్ ధనంజయరెడ్డిని వెంటనే బేషరతుగా విడుదల చేసి.. కౌంటింగ్ హాల్ లో రభస సృష్టించిన దోషులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మీరు పోలీసులను, స్థానిక ఎన్నికల అధికారులను ఆదేశించాలని కోరారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సక్రమం గా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని.. ఎటువంటి పాసులు, గుర్తింపు కార్డులు లేకుండా కౌంటింగ్ స్టేషన్‌లో చొరబడిన వైసీపీ అనుచరుల వీడియోను లేఖకు జత చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa