రోడ్డు ప్రమాదంలో కడపజిల్లా, మదనపల్లెకు చెందిన ఇరువురు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్ళితే... మదనపల్లె పట్టణంలోని కోటవీధికి చెందిన షఫీవుల్లా (55) సివిల్ ఇంజనీర్. ఈయన భార్య షాహీనాబేగం (50) గృహిణి. వారికి ముగ్గురు కుమార్తెలు షాదు, షైమా, షిఫాలు ఉన్నారు. కుమార్తె షిఫా శుక్రవారం అమెరికాకు వెళుతుండగా తల్లిదండ్రులు ఆమెను కారులో తీసుకెళ్లి బెంగళూరు ఎయిర్పోర్టులో వదిలిపెట్టి తిరిగి వస్తుండగా లక్ష్మీపురం క్రాస్ సమీపంలో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న లోయలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ప్రమాదంలో దంపతులు వాహనంలోనే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనను పరిశీలించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనతో కోటవీధిలో విషాదఛాయలు అలుముకున్నాయి.