కాకినాడలో ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే..... కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామానికి చెందిన పెంటా దుర్గాప్రసాద్ కాకినాడలోని దేవదాయశాఖ జిల్లా ప్రధాన కార్యాలయం వద్ద టాటా ఏస్ వాహనంపై కొబ్బరి బొండాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ మిద్దెం చిన్నారావు(60) వారంరోజులుగా అతడి వద్దకు వస్తూ.. టాటాఏస్ వాహనానికి పెండింగ్ చలానాలు ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించాని కోరుతున్నారు. శుక్రవారం ఉదయం ఏఎంవీఐ వచ్చి చలానా రుసుం కట్టాలని కోరారు. దీంతో వాగ్వాదానికి దిగిన దుర్గాప్రసాద్‌ను ఏఎంవీఐ కారుడ్రైవర్ నెట్టడంతో కాలువలో పడిపోయాడు. కోపోద్రిక్తుడైన దుర్గాప్రసాద్ కొబ్బరిబొండాల కత్తితో వారిపై దాడిచేశాడు. విచక్షణారహితంగా 11చోట్ల నరకడంతో చిన్నారావు పేగులు బయటికి వచ్చాయి. కత్తివేటును అడ్డుకునే క్రమంలో చిన్నారావు ఎడమచేతి బొటవేలు తెగిపడింది. స్థానికులు, పోలీసులు క్షతగాత్రుడ్ని జీజీహెచ్‌కు తరలించగా వైద్యులు చేతిని అతికించేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేశారు. ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలిపారు. డ్రైవర్ వీరవెంకట సత్యనారాయణ చేతులకు గాయాలయ్యాయి. అతడిని కూడా ఆస్పత్రికి తరలించారు.