అన్నదమ్ములు, స్నేహితులు, ఆత్మీయుల మధ్య చిన్నచిన్న మాటలు వస్తుంటాయి. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చిరంజీవితో గతంలో వచ్చిన విభేదాలపై నటుడు మోహన్ బాబు పేర్కొన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటులు చిరంజీవి, మోహన్ బాబు. 15 ఏళ్ల కిందటి వజ్రోత్సవాల నుంచి ఇటీవలి ‘మా’ ఎన్నికల దాకా... పలు విషయాల్లో వీరిద్దరి మధ్య వివాదాలు చెలరేగినట్లు వార్తలు వచ్చాయి. అయితే తమ మధ్య ఎలాంటి వివాదాలు, విభేదాలు లేవని ఇద్దరు నటులు పలుమార్లు చెప్పుకొచ్చారు.
తాజాగా ఇదే విషయంపై ఓ ఇంటర్వ్యూలో మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వజ్రోత్సవాల్లో జరిగిన వివాదంపై స్పందించారు. సోషల్ మీడియాలో ఇలాంటివి ఎన్నో వార్తలు వస్తుంటాయని, ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకని అన్నారు. ప్రస్తుతం తాము సంతోషంగా ఉన్నామన్నారు. ‘‘అన్నదమ్ములు, స్నేహితులు, ఆత్మీయుల మధ్య చిన్నచిన్న మాటలు వస్తుంటాయి. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు’’ అని అన్నారు.
‘మా’ ఎన్నికల సందర్భంగా జరిగిన పరిణామాలపై మోహన్ బాబు స్పందిస్తూ... ‘‘ఆ బాధ ఇప్పటికీ నా మనసులో ఉంది. అలా ఎందుకు జరిగింది? అది అతని తప్పా? నా తప్పా? అనేది ఇప్పుడు చర్చించాలని అనుకోవడం లేదు. మేమిద్దరం వందసార్లు ఎదురుపడ్డాం. వందసార్లు మాట్లాడుకున్నాం. మా మధ్య ఏమీ లేదు. మా గొడవలు... భార్యభర్తల మధ్య ఉండే గొడవల్లాంటివి’’ అని వివరించారు. తమ మధ్య ఎలాంటి వివాదాలు లేవని, అంతా కూల్ అని చెప్పారు.