ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, నగరాల మధ్య రాకపోకలు సాగిస్తోన్న అత్యాధునిక వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల సంఖ్య ఇక మరింత పెరగనుంది. ప్రయాణికుల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోన్న నేపథ్యంలో వాటిని మరింత విస్తరించనుంది. ఏపీ-తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో రాకపోకలు సాగిస్తోన్న ఈ రైళ్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటివరకు 10 రైళ్లు పట్టాలెక్కాయి. ఈ సిరీస్ లో ఎనిమిదో రైలు సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య తిరుగాడుతోంది.
ఈ డిమాండ్ కాస్త- శతాబ్ది, రాజధాని ఎక్స్ ప్రెస్ లకు ఎసరు పెట్టేలా పరిణమించింది. ఈ రెండు సర్వీసుల స్థానంలో వందే భారత్ ను ప్రవేశపెట్టే యోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. శతాబ్ది, రాజధానిలను పక్కనపెట్టి వాటికి బదులుగా వందే భారత్ రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకుని వచ్చే దిశగా చర్యలు తీసుకుంటోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. వందే భారత్ కొత్త కోచ్ లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తరువాత దశలవారీగా శతాబ్ది, రాజధానిలను రద్దు చేస్తారని తెలుస్తోంది.