ప్రస్తుత విద్యా సంవత్సరం ఇంకా పూర్తి అవ్వక ముందే అడ్మిషన్ల వేటలో పడ్డారు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం. చదువు చెప్పడం కన్నా కాసుల కక్కుర్తిలో ముందు ఉన్నారు ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు. బాపట్లలో ప్రైవేటు విద్యా సంస్థలు కార్మిక చట్టాలతో పాటు, ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడిచే పనిలో పడ్డారు. చట్టంలో విద్య వ్యాపారం, లాభసాటి పనిగా చేయరాదని ఉన్నా, చట్టాలను బేఖాతరు చేస్తున్నారు. సెలవు రోజుల్లో ఉపాధ్యాయుల చేత పనులు చేయిస్తున్నారు. ఆదివారం పాఠశాల బస్సులో గ్రామాలకు తిప్పుతూ వారి చేత తమ పాఠశాలల్లో పిల్లలను చేర్చాలని ప్రచారం చేయిస్తున్నారు.
దిగువ మధ్య తరగతికి చెందిన ఉపాధ్యాయులు ఉద్యోగం పోతుందనే అభద్రత భావం, భయం తో కిక్కురు మనకుండా యాజమాన్యం చెప్పే విధంగా నడుచుకుంటున్నారు. ఒక వైపు రోజుకు 8 తరగతులకు పాఠాలు చెబుతూ, మరో వైపు స్టడీ క్లాసులు తీసుకుంటున్నారు. అర్హత ఉన్నా అతి తక్కువ జీతం ఇచ్చి వారి చేత వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. అది చాలదన్నట్లు ఇలా సెలవు రోజుల్లో ప్రచారం చేయిస్తూ వారి శ్రమ ను దోచుకుంటున్నారు. ఇలాంటి పాఠశాలల పై ఉన్నతాధికారులు నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.