దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల ట్రస్టు బోర్డు సభ్యుల నియామకాల్లో నాయీ బ్రాహ్మణులకు అవకాశం కల్పిస్తూ ఇటీవల ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది, దీంతోపాటు కేశ ఖండనశాలల్లో విధులు నిర్వహించే నాయీ బ్రాహ్మణులకు నెలకు కనీసం రూ. 20,000 ఆదాయాన్ని వర్తింపజేస్తూ ఇటీవల వైయస్ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సచివాలయం వద్ద ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సిద్దవటం యానాదయ్య, డైరెక్టర్‌లు, నాయీ బ్రాహ్మణ (కేశ ఖండనశాల) జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గుంటుపల్లి రామదాసు, జేఏసీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. వెనుకబడిన కులాలు సమాజానికి వెన్నెముకలని నిరూపిస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తమ సామాజిక వర్గానికి న్యాయం చేశారని, త్వరలో నాయీ బ్రాహ్మణ కృతజ్ఞతా సభ నిర్వహించనున్నట్లు నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్‌లు, ఇతర జేఏసీ నేతలు తెలిపారు.