తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. మార్చి 27న శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఏప్రిల్ నెలకు సంబంధించిన రూ.300 దర్శన టికెట్ల కోటాను ఈనెల 27న ఉదయం 11గంటలకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. ఈ మేరకు భక్తులు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.
మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం స్వామివారిని 63,507 మంది భక్తులు దర్శించుకున్నారు. శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. స్వామివారికి 29,205 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.
ఇటు హరికథా పితామహుడు అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసుతో ప్రారంభమైన హరి కథా సంప్రదాయం మన తెలుగువారి స్వంతమని, తెలుగు భాషలో తప్ప ఏయితరభాషలోను హరికథాగానం లేదని టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా.ఆకెళ్ల విభీషణ శర్మ చెప్పారు. అన్నమాచార్య కళామందిరంలో అన్నమాచర్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి శ్రీ రామాయణ హరికథా సప్తాహ యజ్ఞం ప్రారంభమైంది. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్టర్ విభీషణ శర్మ మాట్లాడుతూ, హరికథ లలితకళల సమాహార స్వరూపమన్నారు.
సంగీతం సాహిత్యం నాట్యంమూడింటిలోను ప్రావీణ్యం ఉన్నవారు మాత్రమే హరికథాగానం సమర్ధవంతంగా నిర్వహించగలరని హరికథ విశిష్టతను ఆయన వివరించారు. తుడా సెక్రటరీ శ్రీమతి లక్ష్మి జ్యోతి ప్రజ్వలనంతో శ్రీ సీతారామకల్యాణ హరికథాగానంతో ఈసప్తాహం ప్రారంభమయ్యింది. ఈ సందర్బంగా అన్నమాచార్య ప్రాజెక్టు హరికథా కళాకారిణి శ్రీమతి జయంతి సావిత్రిని శ్రీవేంకటేశ్వర సంగీత కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి ఉమా ముద్డుబాల, శ్రీ భగవాన్ డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ ఘనంగా సత్కరించారు.
శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కళాశాలను కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ చైర్మన్ శ్రీ వైద్య జయంత్ యశ్వంత్ దేవ్ పూజారి సందర్శించారు. విద్యార్థులు తమ శరీర తత్వాన్ని అర్థం చేసుకుని అంకిత భావంతో అందుకు అనుగుణంగా అధ్యయన విధానాన్ని అవలంబిస్తే అనుకున్న లక్ష్యాన్ని సులభంగా సాధించగలుగుతారన్నారు. ఆయుర్వేద సంహితలు, వాటి ఔన్నత్యాన్ని వివరిస్తూ, అవి అధ్యయనానికి ఏ విధంగా తోడ్పడతాయో సవివరంగా తెలియజేశారు. ఆయుర్వేద వైద్యానికి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందన్నారు. ఆయుర్వేద కళాశాల, వైద్యశాల చక్కని సేవలు అందిస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa