ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సహజరీతిలో మూత్రవిసర్జన చేయలేక నిత్య నరకం,,,బ్రిటన్ మహిళకు అరుదైన వ్యాధి

international |  Suryaa Desk  | Published : Sat, Mar 25, 2023, 08:50 PM

మలమూత్ర విసర్జనను కాలకృత్యాలు అని కూడా అంటారు. ఓ క్రమపద్ధతిలో జరిగేవని దీని అర్థం. కాబట్టి..  ప్రకృతి పిలిచిందంటే వెళ్లి తీరాల్సిందే. కానీ.. ఓ బ్రిటన్‌ మహిళ ఏకంగా 14 నెలల పాటూ సహజరీతిలో మూత్ర విసర్జన చేయలేక నానా అవస్థలూ పడింది. మూత్రాశయంలో మూత్రం పేరుకుపోయి ఇక్కట్ల పాలైంది. తనకు ఇలాంటి అరుదైన సమస్య ఎందుకు వచ్చింది?  ఏ చికిత్స తీసుకుందీ వివరిస్తూ తాజాగా ఓ అంతర్జాతీయ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది.


ఎల్లీ ఆడమ్స్ ఓ కంటెంట్ క్రియేటర్. అప్పటిదాకా అనారోగ్యం అంటే ఏంటో తెలియని ఆమెకు 2020 అక్టోబర్‌లో జీవితం అనూహ్య మలుపు తిరిగింది. అకస్మాత్తుగా ఓ రోజు ఆమెకు మూత్రం ఆగిపోయింది. మూత్ర విసర్జన చేయాలపిస్తున్నా కుదరని పరిస్థితి. తీవ్ర ఇబ్బంది తలెత్తడంతో ఆమె చివరకు వైద్యులను ఆశ్రయించింది. వివిధ పరీక్షలు జరిపిన డాక్టర్లు ఆమెకు తక్షణ ఉపశమనం కోసం ట్యూబ్ ద్వారా మూత్రాశయంలో పేరుకుపోయిన మూత్రాన్ని తొలగించారు. మూత్రాశయంలో గరిష్ఠంగా 500 మిల్లీలీటర్లు పట్టే అవకాశం ఉండగా మహిళ మూత్రాశయంలో ఇందుకు రెట్టింపు మొత్తంలో మూత్రం పేరుకుపోయింది.


ఆడమ్స్.. ఫౌలర్స్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు చివరకు వైద్యులు తేల్చారు. ఈ సమస్య ఉన్న వారు సజావుగా మూత్ర విజర్జన చేయలేరు.  ఈ వ్యాధికి కారణమేంటో కూడా తెలియదు. ఈ వ్యాధికి చికిత్సా విధానాలు కూడా పరిమితమే. దీంతో..సన్నని రబ్బరు పైపు(క్యాథెటర్) సాయంతోనే ఆమె మూత్ర విసర్జన చేయాల్సి వచ్చింది. అయితే..వైద్యులు చివరి ప్రయత్నంగా మూత్రవిసర్జనకు కారణమయ్యే నాడులను ప్రేరేపించేందుకు వెన్నుముక కింద ఓ చిన్న పరికరాన్ని అమర్చారు. దీంతో..మహిళకు కాస్తంత ఉపశమనం లభించింది.


ఈ పరికరాన్ని అమర్చాక క్యాథెటర్ అవసరం దాదాపు 50 శాతం తగ్గిందని ఆమె సంబరపడుతూ చెప్పింది. కానీ..ఆడమ్స్ తన జీవితాంతం  క్యాథెటర్‌పై ఆధారపడక తప్పదని వైద్యులు స్పష్టం చేశారు. ఏదో ఒక సందర్భంలో దాని అవసరం ఏర్పడుతుందని స్పష్టం చేశారు. అయితే.. సమస్య నుంచి ఈ మాత్రమైనా ఊరట లభించినందుకు తాను ఎంతో అదృష్టవంతురాలినని చెప్పుకొచ్చింది ఆడమ్స్!







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa