ట్విట్టర్ అంటే తెలియని వారు ఉండరు. దీని బట్టి చూస్తే ట్విట్టర్ యొక్క విలువ ఏ పార్టీతో మనకు ఇట్టే అర్థమవుతుంది. ఇదిలా ఉంటే టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుల్లో ఒకడైన ఎలాన్ మస్క్.. ఐదు నెలల క్రితం సామాజిక మాధ్యమ వేదిక అయిన ట్విట్టర్ లో మెజారిటీ వాటా కొనుగోలు చేశారు. నాడు ట్విట్టర్ కు 44 బిలియన్ డాలర్లు (రూ.3.6 లక్షల కోట్లు) విలువ కట్టారు. ఒక్కో షేరుకు 54.20 డాలర్లు ఆఫర్ చేశారు. టెస్లా మాదిరే ట్విట్టర్ దశ తిరిగిపోతుందని కొందరు భావిస్తే.. మస్క్ మనస్తత్వానికి ట్విట్టర్ తగదని కొందరు నిపుణులు నాడు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ట్విట్టర్ కొనుగోలు చేసిన మొదటి రోజు నుంచే మస్క్ దాని పూర్తి ప్రక్షాళనపై దృష్టి పెట్టారు. సగానికి పైగా ఉద్యోగులను గెంటేశారు. ఒక్కరితోనే రెండింతల పని చేయించుకోవడం మొదలు పెట్టారు. భారత్ లో ఒకటి మినహా, మిగిలిన కార్యాలయాలను మూసివేశారు. మొత్తంగా నష్టాలను తగ్గించే చర్యలు తీసుకున్నారు. దీంతో కీలకమైన మానవ వనరులు కూడా దూరమయ్యాయి.
ఐదు నెలలు తిరిగేసరికి ట్విట్టర్ విలువ ప్రస్తుతం 20 బిలియన్ డాలర్లు అని స్వయంగా ఎలాన్ మస్క్ ప్రకటించారంటే ఆసక్తి కలగక మానదు. అంటే నాడు మస్క్ చెల్లించిన దానితో పోలిస్తే సగానికి పైనే విలువ హరించుకుపోయింది. నిపుణుడైన సీఈవోను నియమించకుండా.. ట్విట్టర్ బాధ్యతలన్నీ తన నెత్తినే వేసుకుని, ఒంటెత్తు పోకడలు పోతున్న మస్క్ కు మార్కెట్ సరైన సమాధానం చెప్పిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ట్విట్టర్ ప్రస్తుత విలువ 20 బిలియన్ డాలర్లు అంటూ ఉద్యోగులకు పంపిన మెయిల్ లో మస్క్ పేర్కొన్నట్టు ఏఎఫ్ పీ వార్తా సంస్థ పేర్కొంది. స్టాక్ ఆప్షన్ కార్యక్రమాన్ని ప్రకటిస్తూ, సంస్థ విలువ గురించి మస్క్ ప్రస్తావించారు. మస్క్ ట్విట్టర్ ను సొంతం చేసుకున్న తర్వాత పెద్ద పెద్ద ప్రకటనదారులు దూరమయ్యారు. దీంతో సంస్థకు భారీ ఆదాయం రాకుండా గండి పడింది. కష్టమే అయినా, ట్విట్టర్ ను 250 బిలియన్ డాలర్ల వ్యాల్యూయేషన్ కు తీసుకెళ్లే మార్గంలోనే ఉన్నట్టు మస్క్ ప్రకటించారు. అంటే ఇక్కడి నుంచి ట్విట్టర్ షేరు పది రెట్లకు పైనే పెరగాల్సి ఉంటుంది