తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకొంది. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చేరిక తర్వాత నేతలు దూకుడు పెంచారు. కలసికట్టుగా ముందుకు సాగుతున్నారు.. పార్టీ కార్యక్రమాలకు కలిసి వెళుతున్నారు. ఈ క్రమంలో మరో ఆసక్తికర పరిణామం జరిగింది. గుంటూరు కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశ విందు నిర్వహించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జులు అందరూ హాజరుకాగా.. ఇద్దరు మాత్రం రాలేకపోయారు. పార్టీలో కార్యకర్తలకు అండగా ఉంటూ తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు బనాయిస్తే ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలు అందరూ సమష్టిగా ఉద్యమించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఆసక్తికరంగా ఎన్నో ఏళ్లగా రాజకీయాల్లో వైరి వర్గాలుగా ఉన్న మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీ రాయపాటి కుటుంబాలు కలిశాయి. కన్నా నివాసంలో జరిగిన ఆత్మీయ విందు సమావేశానికి రాయపాటి సాంబశివరావు సోదరుడైన మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాసరావు హాజరయ్యారు. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న సమయం నుంచి ఇద్దరి మధ్య విభేదాలు ఉండేవి. అప్పట్లో పరువు నష్టం కేసులు కూడా నడిచాయి.. ఆ తర్వాత ఇద్దరు రాజీ చేసుకున్నారు. 2014లో రాయపాటి టీడీపీలో చేరారు.. ఆ తర్వాత కన్నా బీజేపీకి వెళ్లారు.
ఇటీవల కన్నా టీడీపీలోకి రాగా.. రాయపాటి కుటుంబంతో కలిసి నడుస్తారా అనే చర్చ జరిగింది. ఈ క్రమంలోనే రాయపాటి శ్రీనివాస్ లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అయితే గతంలో ఉన్న రాజకీయ విభేదాలను పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం కలిసి పనిచేయాలని నిర్ణయించారని తెలుస్తోంది. కన్నా, రాయపాటి కలయికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని అనుచరులు అంటున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా ఈ కలయిక ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి జిల్లాలో వచ్చే ఎన్నికల్లో 17 అసెంబ్లీ, మూడు పార్లమెంటు సీట్లలో గెలుపే లక్ష్యంగా పని చేయాలని నేతలు నిర్ణయించారు.
అనంతరం నేతలు అందరూ కలిసి గురజాలలో టీడీపీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వెళ్లారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని.. అమరావతి నిర్మాణం మూలన పడేతశారని.. మళ్లీ రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటేనే సాధ్యమన్నారు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ. రాష్ట్రంలో రాక్షస పాలన అంతం చేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని.. ముఖ్యమంత్రి జగన్ అన్ని రంగాల్లో విఫలం చెందారన్నారు. రాష్ట్రాన్ని దోచుకోవడం మినహా.. రాష్ట్రంలో చేసిందేమీ లేదన్నారు.
రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ జై అమరావతి అనాల్సిందే అన్నారు మాజీ ఎమ్మెల్యే యరపతనేని శ్రీనివాసరావు. ఈ ప్రభుత్వం పని అయిపోయిందని.. మాచర్లలో పిన్నెల్లి సోదరులను సాగనంపే సమయం దగ్గర్లో ఉందన్నారు. పల్నాడు ప్రజానీకంలో కోపం పెరిగిందని.. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురు చూస్తున్నారన్నారు మాచర్ల టీడీపీ ఇంఛార్జ్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి. మొత్తానికి ఉమ్మడి గుంటూరు జిల్లాలో నేతలంతా ఏకతాటిపై నడుస్తున్నారు.