వచ్చే మాసానికి తిరుమల శ్రీవారి దర్శన టికెట్లకు ఆన్‌లైన్‌లో 3.26 లక్షల టికెట్లను విడుదల చేసింది. ఈ టికెట్ల విక్రయాలు గంటన్నర సమయంలోనే పూర్తయ్యాయి. దీంతో శ్రీవారి దర్శన టికెట్లకు ఎంత డిమాండ్ ఉందో అర్థం అవుతోంది. ఇప్పుడే కాదు.. గతంలోనూ టీటీడీ విడుదల చేసిన గంటల వ్యవధిలోనే టికెట్ల విక్రయాలు పూర్తయ్యాయి. అందుకే టికెట్ల విడుదల కోసం.. భక్తులు ఆతృతగా ఎదురుచూస్తారు.
గత నెలలో.. మార్చి నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేసింది. ఆరు లక్షల టికెట్లను భక్తులు 60 నిమిషాల వ్యవధిలోనే బుక్ చేసుకున్నారు. ఏప్రిల్, మే మాసాలకు సంబంధించిన అంగప్రదక్షిణ టికెట్లను రోజుకు 750 చొప్పున టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయగా.. కేవలం 9 నిమిషాల వ్యవధిలో భక్తులు వీటిని బుక్ చేసుకున్నారు. వయోవృద్ధులు, వికలాంగుల దర్శనానికి సంబంధించి రోజుకు వెయ్యి చొప్పున మార్చి నెలకు సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తే.. గంటా 35 నిమిషాల వ్యవధిలో భక్తులు పొందారు.