చంద్రబాబు నాయుడు పై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడు అంటేనే నయవంచన, నమ్మకద్రోహం, వెన్నుపోటు అని పేర్ని నాని విమర్శించారు. జగన్ అంటే నమ్మకం, మనసులో ఏది ఉంటే అది చెప్పడం, చేదు నిజం అయినా.. మొహం మీదే చెప్పడం, చేసేదే చెప్పడం.. చేయలేనిది సూటిగా చెప్పడం.. అని స్పష్టం చేశారు. ఇందుకే కదా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే ప్రజలకు అంత అభిమానం అని వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పేర్నినాని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుపై ఘాటు విమర్శలు చేశారు.
'1995లో కూడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కూల్చారు. ఇది నిజం కాదా. అదే చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న జగన్‌ను చూడండి.. కాంగ్రెస్ పార్టీ తనకు బంధనాలు విధిస్తే.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత సొంతంగా పార్టీ పెట్టుకొని.. ఈ స్థాయికి వచ్చారు. అదే చంద్రబాబుకు ఎన్టీ రామారావుతో పడకపోతే.. రాజీనామా చేసి.. వేరే పార్టీ పెట్టుకోవాల్సింది కదా. కానీ.. అలా చేయకుండా.. టీడీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ముఖ్యమంత్రి అయ్యారు' అని పేర్ని నాని విమర్శించారు.
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా.. టీడీపీకి సరైన బలం లేకుండానే చంద్రబాబు వేం నరేందర్ రెడ్డి ని పోటీ చేయించారు. ఆ సమయంలో కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేను కొనుగోలు చేయాలని చూశారు. ఓటుకు నోటు కేసు లో ఇరుక్కున్నారు. ఆ కేసులకు భయపడి వచ్చి కరకట్టకు చేరారు. రాష్ట్ర ప్రయోజనాలను కూడా గాలికి వదిలేశారు. ఇది చంద్రబాబు చరిత్ర కాదా. 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కూడా కొనుగోలు చేసి.. వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వలేదా. వీటిలో ఏదైనా అసత్యం ఉందా' అని పేర్ని నాని ప్రశ్నించారు.
ఇవన్నీ వదిలేసి చంద్రబాబు నంగనాచి కబుర్లు చెబుతున్నారు. కొనటం, అమ్మడమే చంద్రబాబు విజయ రహస్యం. చంద్రబాబు చరిత్ర అంతా కొనుగోలు రాజకీయమే. ఉండవల్లి శ్రీదేవి కూడా స్వార్థ రాజకీయాలు చేస్తున్నారు. అవమానించారంటూ అసత్యాలు మాట్లాడుతున్నారు. ఆమెకు నియోజకవర్గంలో ఆదరణ తగ్గింది. ఆ విషయాన్ని శ్రీదేవికి పార్టీ అధ్యక్షుడు నేరుగానే చెప్పారు. టికెట్ దక్కదని ఆ ఎమ్మెల్యే పార్టీకి నమ్మకద్రోహం చేశారు. ఎంత మంది వెళ్లిపోయినా పార్టీకి ఎలాంటి నష్టం లేదు. వైసీపీలో.. జెండా మోసే కార్యకర్త.. జగన్.. వీరిద్దరే శాశ్వతం. మిగతా వారు ఆయారాం.. గయారాంలే' అని పేర్ని నాని స్పష్టం చేశారు.