పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై.. కేంద్ర ప్రభుత్వం ఫుల్ క్లారిటీ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లు అని మోదీ సర్కార్ స్పష్టం చేసింది. రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు.. కేంద్ర జలశక్తి సహాయమంత్రి బిశ్వేశ్వర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 1980 నాటి గోదావరి ట్రిబ్యునల్ అవార్డ్ ప్రకారం.. రిజర్వాయర్ ఎత్తు 45.72 మీటర్లు అని కేంద్రం స్పష్టత ఇచ్చింది.
ఇదే సమయంలో.. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించినట్టు తమకు సమాచారం రాలేదని కేంద్ర మంత్రి తన సమాధానంలో స్పష్టం చేశారు. అయితే.. కొన్ని రోజుల కిందట సీఎం జగన్ అసెంబ్లీలో పోలవరం ఎత్తు విషయంలో స్పష్టమైన ప్రకటన చేశారు. పోలవరం ఎత్తు తగ్గించే ప్రసక్తి లేదని కుండ బద్ధలుకొట్టారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు. పోలవరం ఎత్తు తగ్గించారనే వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు.
పోలవరం అంచనా వ్యయంపై కూడా కేంద్రం క్లారిటీ ఇచ్చింది. 2017 - 18 ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 47,725 కోట్లు అని స్పష్టం చేసింది. 2019లో జలశక్తి శాఖకు ఇచ్చిన సవరించిన ప్రాజెక్టు అంచనా వ్యయం.. రూ. 55,548.87 కోట్లు కాగా.. ఈ అంచనాలను జలశక్తి శాఖ అడ్వైజరీ కమిటీ అంగీకరించింది. 2020లో రివైజ్డ్ కాస్ట్ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. 2013 - 14 ధరల ప్రకారం అంచనా వ్యయం రూ. 29,027.95 కోట్లు అని కేంద్ర మంత్రి వివరించారు. ప్రాజెక్టు కోసం భూ సేకరణ, పరిహారం, పునరావాసం ధరలలో పెరుగుదలే ప్రాజెక్టు వ్యయం పెరగడానికి కారణం అని కేంద్రం స్పష్టం చేసింది.