రాహుల్ గాంధీ అనర్హత అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ.. లక్షద్వీప్ మాజీ ఎంపీ మహ్మద్ ఫైజల్ పిటిషన్పై విచారణకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. ఫైజల్ పిటిషన్పై మంగళవారం విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం సోమవారం పేర్కొంది. హత్యాయత్నం కేసులో ఆయనకు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చిన దృష్ట్యా ఫైజల్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ.. లోక్‌సభ సెక్రటేరియట్ ఈ ఏడాది జనవరి 15న నోటిఫికేషన్ జారీచేసింది. అయితే, దీనిని కేరళ హైకోర్టులో సవాల్ చేయగా.. ఫైజల్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది.
ఫైజల్ అనర్హతను వెంటనే తొలగించాలని ఉత్తర్వులు ఇచ్చింది. అయినా సరే ఇంత వరకూ లోక్‌సభ సెక్రటేరియట్ నిర్ణయం తీసుకోకపోవడంతో మహ్మద్ ఫైజల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన అనర్హతను వెంటనే తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఆయన తరఫున పిటిషన్ వేసిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ.. దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు. కేరళ హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించిన విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అయినా సరే ఇంత వరకూ ఆయన అనర్హతను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోలేదని వివరించారు.
ఈ నేపథ్యంలో విచారణకు అంగీకరించిన సీజేఐ డీవై చంద్రచూడ్.. జస్టిస్ కేఎం జోసెఫ్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపడుతుందని తెలిపారు. 2009 సాధారణ ఎన్నికల సందర్భంగా దివంగత కాంగ్రెస్ నేత పి.ఎం.సయీద్ అల్లుడు మహమ్మద్ సలీహ్‌పై ఫైజల్ హత్యాయత్నం చేశారంటూ మహ్మద్ ఫైజల్ పాటు మరో ముగ్గురిపై కేసు నమోదయింది. విచారణ జరిపిన కవరత్తి సెషన్స్ కోర్టు పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.లక్ష చొప్పున జరిమానా విధించింది. దీంతో ఆయన పార్లమెంట్ సభ్యత్వం రద్దుచేయగా.. దీనిని ఫైజల్ కేరళ హైకోర్టులో సవాల్ చేశారు.
జనవరి 25న తీర్పు వెలువరించిన కేరళ హైకోర్టు సింగిల్ బెంచ్.. అనర్హత చెల్లదని పేర్కొంది. సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదిన్నర మాత్రమే సమయం ఉందని.. అటువంటప్పుడు ఉప-ఎన్నికలతో ప్రజాధనం వృధా చేయడం ఎందుకని జస్టిస్ బెచు కురియన్ థామస్ అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు, నిందితుల వద్ద ప్రమాదకర ఆయుధాలు ఉన్నాయనడానికి ఎలాంటి ఆధారాల్లేవని, బాధితుడికి తీవ్రమైన గాయాలైనట్టు లేవని వ్యాఖ్యానించారు.