శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఫోర్జరీ డిగ్రీ సర్టిఫికెట్‌తో మూడు సంవత్సరాల న్యాయ విద్యలో అడ్మిషన్ తీసుకున్నాడని, దానిపై ఫిర్యాదు చేశానని టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ అధ్యక్షుడు కూన రవికుమార్ తెలిపారు. ఈమేరకు రాష్ట్రపతి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, తెలుగు రాష్ట్రాల గవర్నర్‌లకు లేఖలు రాసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.... ‘‘2019లో సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో డిగ్రీ డిస్కంటిన్యూడ్ అని స్పష్టంగా తమ్మినేని పేర్కొన్నారు. 2019 మే నెలలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది. జూన్‌లో సీతారాం స్పీకర్ పదవి చేపట్టారు. కానీ 2019 ఆగస్టులో ఉస్మానియా యూనివర్శిటీ పరిధి ఎల్‌బీ నగర్‌లో మహాత్మాగాంధీ న్యాయ కళాశాలలో మూడు సంవత్సరాల బీఎల్‌లో అడ్మిషన్ పొందారు. ఇందుకుగాను ముమ్మాటికీ ఫోర్జరీ డిగ్రీ సర్టిఫికెట్‌ను స్పీకర్ తమ్మినేని సమర్పించారు. మూడేళ్ల న్యాయ కోర్సులో చేరాలంటే డిగ్రీ కచ్చితంగా ఉత్తీర్ణులై ఉండాలి. లేదా సమాన అర్హతగల పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. రాజ్యాంగ బద్ధమైన పదవిలో కొనసాగుతూ, సభలో నీతిచంద్రికలు వల్లె వేస్తుండే సీతారాంపై విచారణ జరపాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వెంటనే ఈవిషయంపై సీఐడీతో దర్యాప్తు చేపట్టాలి. స్పీకర్ ఫోర్జరీ సర్టిఫికేట్ సబ్‌మిట్ చేసినందుకుగాను క్రిమినల్ కేసు నమోదు చేయాలి’’ అని కూన రవికుమార్ డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌లకు ఫిర్యాదు చేశానని వెల్లడించారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టి.. తమ్మినేనిని స్పీకర్ పదవి నుంచి తొలగించాలని సీఎం జగన్‌కు లేఖ రాశానని తెలిపారు. స్పీకర్ తక్షణమే రాజీనామా చేయాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కూన డిమాండ్ చేశారు.