ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చట్టం బీజేపీ నేతలకు వర్తించదా... ప్రతిపక్ష నేతల విమర్శ

national |  Suryaa Desk  | Published : Tue, Mar 28, 2023, 06:33 PM

బీజేపీ నేతలకు చట్టాలు వర్తించవా అంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దీనికి కారణాలు లేకపోలేదు. ఇదిలావుంటే 2019 ఎన్నికల ముందు కర్ణాటకలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఇంటిపేరును ప్రస్తావిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం కేసు దాఖలు కాగా.. సూరత్ కోర్టు దోషిగా నిర్దారించి ఆయనకు రెండేళ్ల జైలు శిక్షను విధించింది. దీంతో, లోక్ సభ సెక్రటేరియట్ మార్చి 24న ఆయనను పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేసింది. రాహుల్ అనర్హతపై విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. పార్లమెంట్‌లో ప్రతిపక్షాల గొంతుక నొక్కే ప్రయత్నంలో భాగంగానే బీజేపీ కుట్ర చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.


ఈ నేపథ్యంలో క్రిమినల్ కేసుల్లో దోషులుగా నిర్దారణ అయి.. రెండు నెలల కిందటే జైలు శిక్ష పడిన ఇద్దరు కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలపై ఇంత వరకు అనర్హత వేటు వేయలేదు. దీంతో చట్టాలు బీజేపీ సభ్యులకు వర్తించవా? అని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. కాంట్రాక్ట్ పనుల్లో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొని, నేరం రుజువుకావడంతో హావేరీ బీజేపీ ఎమ్మెల్యే నెహ్రూ ఓలేకర్, అతడి ఇద్దరు కుమారులు సహా ఆరుగుర్ని ప్రత్యేక న్యాయస్థానం దోషిగా నిర్దారించింది. ఈ ఏడాది జనవరిలో తీర్పు వెలువరించిన కోర్టు.. ఎమ్మెల్యేకి రెండేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది.


2009-11 మధ్య అప్పటి కర్ణాటక బీజేపీ ప్రభుత్వం హయాంలో ఎమ్మెల్యే నిధులు రూ.కోటి దుర్వినియోగం చేశారని, కుమారుడికి లబ్ది కలిగించడానికి ప్రజా ధనాన్ని వృధా చేశారని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇక, చిక్‌మగళూరు జిల్లా మడికెరె బీజేపీ ఎమ్మెల్యే కుమారస్వామికి చెక్ బౌన్స్ కేసులో ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం నాలుగేళ్ల జైలు శిక్షను విధించింది. హువప్ప గౌడ అనే వ్యవసాయ పారిశ్రామికవేత్త వద్ద రూ.1.66 కోట్ల తీసుకున్న కుమారస్వామి.. మొత్తం 8 చెక్‌లు ఇచ్చాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితుడు చెక్‌లను వేయడంతో అవన్నీ బౌన్స్ అయ్యాయి.


దీంతో కోర్టు ఆయనకు 8 కేసుల్లో ఆరు నెలల చొప్పున శిక్ష ఖరారు చేసింది. అలాగే, వడ్డీతో కలిపి ఆయనకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఇవ్వాలని ఆదేశించింది. దోషులుగా నిర్దారణ అయిన ఈ ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలకు రెండేళ్లకు మించి జైలు శిక్షపడినా.. వారి శాసనసభ సభ్యత్వాలను ఇంతవరకు రద్దు చేయలేదు. ప్రస్తుతం బెయిల్ పైన ఉన్న వీరిద్దరూ త్వరలో జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక, రాహుల్ గాంధీకి 30 రోజులు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం.. పై కోర్టులో అప్పీల్‌కు అనుమతించింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa