కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై తాజాగా బీజేపీకి చెందిన ఓ ఎంపీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రాహుల్ గాంధీపై అనర్హత అంశంపై రాజకీయ దుమారం రేగుతోన్న వేళ.. గాంధీ కుటుంబంపై బీజేపీ ఎంపీ నోరు జారారు. వ్యక్తిగత దాడికి దిగిన ఆయన.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ మీడియాతో బీజేపీ ఎంపీ సంజయ్ జైస్వాల్ మాట్లాడుతూ.. విదేశీ మహిళకు పుట్టిన వ్యక్తి దేశభక్తుడు కాలేడని వ్యాఖ్యానించారు. ఇవి 2,000 సంవత్సరాల కిందట చాణక్యుడు చెప్పిన మాటలని, ఈరోజు తనకు గుర్తుచేశారని పేర్కొన్నారు. ఇటీవల భోపాల్ బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ సైతం రాహుల్‌ను ఉద్దేశించి ఇటువంటి వ్యాఖ్యలే చేశారు.
రాహుల్ గాంధీని దేశ రాజకీయాల్లోకి అనుమతించకూడదని, ఆయనను భారత్ నుంచి తరిమేయాలని వ్యాఖ్యానించారు. అంతేకాదు, రాహుల్ గాంధీ భారతీయుడు కాదని అన్నారు. ‘నువ్వు భారతదేశానికి చెందినవాడివని మాకు తెలుసు... విదేశీ మహిళకు పుట్టిన వ్యక్తి దేశభక్తుడు కాలేడని రాహుల్ గాంధీ నిరూపించారు’ అని ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ అన్నారు.
తాజాగా, సంజయ్ జైస్వాల్ సైతం ఇదే రకమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. విదేశాల్లో భారత్‌ను రాహుల్ గాంధీ అవమానించారని ఇటీవల కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో రాహుల్ ప్రసంగాన్ని ఉటంకించారు. మన ప్రజాస్వామ్యం, కోర్టులు, జర్నలిస్టులు అన్నీ తప్పు అని మీరు చెబితే భారతదేశాన్ని విశ్వసించరని స్పష్టమవుతోంది అని అన్నారు. రాహుల్ అలవాటైన నేరస్థుడని ధ్వజమెత్తారు. ‘తనను తాను యువరాజుగా భావించిన రాహుల్ గాంధీ ప్రధాని మోదీ వల్ల ఆందోళనకు గురయ్యాడు.. గత రెండు పర్యాయాల నుంచి ప్రధానమంత్రి మంచి మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు’ అని అన్నారు.
అటు, రాహుల్ గాంధీ ఓబీసీ వర్గాన్ని కించపరిచారని ఆరోపిస్తూ అధికార బీజేపీ పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించింది. ఈ సందర్భంగా జైస్వాల్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ అణగారిన వర్గాల పట్ల అవమానకరమైన ప్రసంగం చేశారని ఆరోపించారు. అతను ఎక్కడికి వెళ్లినా ఓబీసీల ఆగ్రహాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని పేర్కొన్నారు.
‘కోర్టు అతనికి అవకాశం ఇచ్చింది..అతను క్షమాపణ చెప్పవచ్చు.. తన వ్యాఖ్య కేవలం నీరవ్ మోదీ, లలిత్ మోదీలను మాత్రమే ఉద్దేశించినవే అన్నాడు.. ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని ఆయన కోర్టులో చెప్పారు.. దీనిని దేశం మొత్తం చూస్తోంది’ అని జైస్వాల్ మండిపడ్డారు. కాగా, ‘బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మనేసర్ నుంచి ఓబీసీ ప్రచారాన్ని ఘర్ ఘర్ చలో, గావ్ గావ్ చలో ప్రారంభించనున్నారు.. బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం ఏప్రిల్ 6 నుంచి బీఆర్ అంబేడ్కర్ జయంతి ఏప్రిల్ 14 వరకు కోటి గ్రామాలకు చేరుకుంటుంది.. ఏప్రిల్ 11న పార్టీ జ్యోతిబా ఫూలే వార్షికోత్సవాన్ని కూడా జరుపుకోనుంది.. ఓబీసీల కోసం ప్రధాని మోదీ ఏమి చేశారు.. యూపీఏ వారి కోసం ఏమి చేసింది.. వారి ప్రయోజనాలను కాంగ్రెస్ ఎలా దెబ్బతీసిందో మేము పోల్చి చూపిస్తాం’ అని వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa