ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం ప్రశాంతి నిలయంలో శ్రీరామ నవమి సందడి మొదలైంది. సత్యసాయి సన్నిధిలో నేటి నుంచి రెండు రోజుల పాటు నిర్వహించనున్న వేడుకలకు సెంట్రల్ ట్రస్ట్ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. సాయికుల్వంత్ సభా మందిరాన్ని ప్రత్యేకంగా ముస్తాబు చేసింది. వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. బుధవారం వేదపఠనంతో నవమి వేడుకలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత శివం బృందం భక్తి గీతాలాపన, మంగళహారతి నిర్వహిస్తారు. సాయంత్రం ప్రముఖ సంగీత విద్వాంసుడు ముత్తు కుమార్ బృందం 'శ్రీరామ స్మరణ' పేరుతో సంగీత విభావరి నిర్వహిస్తారు. 30వ తేదీన సీతారాముల కల్యాణం, సత్యసాయి పూర్వపు ప్రసంగాలు ఉంటాయి. సాయంత్రం సాయి సంగీత రామామృతం పేరుతో సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థులు సంగీత కచేరి నిర్వహించనున్నారు.