వసంతపక్ష ప్రయుక్త నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామికి బుధవారం రాత్రి సంప్రదాయబద్ధంగా ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించారు. తొలుత ఉత్సవమూర్తులను ప్రధాన ఆలయం నుంచి మిథిలా స్టేడియం ముఖద్వారం వద్దకు తీసుకొచ్చారు. వైకుంఠ ద్వారం వద్ద రామచంద్రుడిని ఆయనకు ఎదురుగా మిథిలా స్టేడియం ద్వారం వైపు సీతాదేవిని ఆసీనులను చేశారు. రామచంద్రుడి వైపు అదర్వవేద పండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు, సీతమ్మ వైపు స్థానాచార్యులు కేఈ స్థలశాయి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.
అయోధ్య నుంచి రాముడు, మిథిల నుంచి సీతమ్మ తల్లి వచ్చారని, వారి గుణగణాలను, వంశ గౌరవాన్ని, ప్రతిభను తదితర ప్రాశస్త్యాలను వివరించారు. వర్ణనా కార్యక్రమం అనంతరం మంగళ వాయిద్యాలకు అనుగుణంగా నృత్యం చేస్తూ మాలా పరివర్తన కార్యక్రమాన్ని ఆహ్లాదకరంగా నిర్వహించారు. అనంతరం సీతారామ చంద్రులను పక్కపక్కన ఆసీనులను చేసి ప్రత్యేకహారతి సమర్పించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు, కమిషనర్ అనిల్‌కుమార్ పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం స్వామి వారికి తిరువీధిసేవ నిర్వహించారు.