పల్నాడు జిల్లా, ముప్పాళ్ళ మండలంలోని మాదలలో బుధవారం తెల్లవారుజామున వీదికుక్కలు బీభత్సం సృష్టించాయి. వీధి కుక్కలు గుంపు గొర్రెల మందపై పడి దాడిచేయడంతో 30 గొర్రెలు మృతి చెందగా మరో ఆరు గాయపడ్డాయి. గొర్రెల యజమాని చిమటా వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటేశ్వరరావు తనకు గల మొత్తం 150 గొర్రెలను ఎప్పటిలాగానే మంగళవారం రాత్రి దొడ్డిలో వేసి నిద్రపోయాడు. తెల్లవారు జామున గొర్రెల అరుపులు వినిపిస్తుంటే దొడ్డి వద్దకు వెళ్లాడు. అప్పటికే వీధికుక్కల గుంపు ఫెన్సింగ్‌ను దాటివచ్చి గొర్రెల మందపై దాడి చేస్తున్నాయి. కొన్ని గొర్రెలు మృతి చెందగా మరికొన్ని గాయపడ్డాయి. ఆ సమయంలో కుక్కలను తోలడానికే భయమేసిందని వెంకటేశ్వరరావు తెలిపాడు. గొర్రెల మృతితో తనకు రూ.2.50 లక్షల నష్టంవాటిల్లిందని, గొర్రెలకు బీమా కూడా లేదని, ప్రభుత్వమే ఆదుకోవాలని విలపించాడు. గాయపడిన గొర్రెలకు మాదల పశువైద్యుడు డాక్టర్ పుల్లారెడ్డి చికిత్స చేసి మందులు ఇచ్చారు. మాదలలో సుమారు వందకు పైగా వీధికుక్కలు ఉన్నాయనీ, గుంపులుగా రోడ్లపై తిరుగుతూ వృద్ధులు, చిన్నపిల్లలపై దాడి చేస్తున్నాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు.