రామ అంటే కేవలం రెండు అక్షరాలు కాదు. అదో మహాశక్తి మంత్రమని విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సర్వస్వతి అన్నారు. పీఠంలో గురువారం శ్రీరామనవమి వేడుకలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరాముడిని కీర్తిస్తూ భక్తజనం పండుగ జరుపుకొంటున్న శుభ తరుణమిదన్నారు. చైత్రమాసం శుక్లపక్షం నవమి శ్రీరామనవమి. శ్రీ మహా విష్ణువు త్రేతాయుగంలో ధర్మస్థాపన కోసం శ్రీరాముడిగా అవతరించిన దినమే చైత్ర శుక్లపక్ష నవమి శ్రీరామ నవమి అని పేర్కొన్నారు. శ్రీరామ జననం, సీతారాముల కల్యాణం, శ్రీరామ పట్టాభిషేకం. మన సనాతన ధర్మం, పురాణాలు, జ్యోతిషశాస్త్రం ప్రకారం మహా విష్ణువు ప్రతి అవతారానికి ఒక్కో గ్రహం ప్రామాణికంగా ఉంటుందని చెప్పారు.
నారసింహ అవతారం కుజగ్రహాన్ని సూచిస్తుంది. కృష్ణావతారం చంద్రగ్రహాన్ని సూచిస్తుంది. వామన అవతారం గురుగ్రహం. అలాగే శ్రీరామ అవతారం నవగ్రహాలకు అధిపతి అయిన సూర్యభగవానుడిని సూచిస్తుందన్నారు. రామాయణం, జ్యోతిషశాస్త్రం ప్రకారం. శ్రీరాముడు త్రేతాయుగంలోని గురువారం రోజున చైత్ర శుక్ల నవమినందు కర్కాటక లగ్నంలో జన్మించినట్టుగా పురాణాలు చెబుతున్నాయన్నారు. శ్రీరామనవమి రోజు ఏ వ్రతం చేసినా ఫలించదని, కేవలం శ్రీరామవ్రతం మాత్రమే ఫలిస్తుందని, ఈ వ్రతానికి మించినది లేదని ఆయన భక్తులకు అనుగ్రహభాషణం చేశారు.