జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తిగా అవినీతి మయమని, ఇళ్ళ స్దలాల సేకరణ కోసం వైసీపీ ఎమ్మెల్యేలే ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని మాజీ మంత్రి ఆలపాటి రాజావిమర్శించారు. గుంటూరు జిల్లాలో ఒక్కో వైసీపీ ఎమ్మెల్యే రూ. 150 కోట్ల చొప్పున మొత్తం 7 వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. పేదవాడికి కేవలం 44 గజాలు మాత్రమే ఇచ్చారని, టిట్కో గృహాలను పేదలకు ఎందుకు పంచలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆలపాటి రాజా డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో 12 లక్షల ఇళ్ళు నిర్మించి పేదలకు ఇచ్చామన్నారు. లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేసి తిరిగి మళ్ళీ ప్రభుత్వం తీసుకుంటోందని విమర్శించారు. ఇళ్లు నిర్మాణాలు పూర్తి చేయకుండానే ఈఎంఐ లు వసూలు చేస్తున్నారని, సంక్షేమం పేరుతో పేదవాడికి ద్రోహం చేశారని, అభివృద్ధి పేరుతో భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆలపాటి రాజా ఆరోపించారు.