జివిఎంసి ఆస్తి, ఖాళీ జాగా పన్నుల రూపేన ఈ ఆర్ధిక సంవత్సరం లక్ష్యానికి మించి వసూలు అయిందని విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్రంలో అతి పెద్ద కార్పోరేషన్ అయిన మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో 5. 59 లక్షలు ఆస్తి పన్ను అసెస్స్మెంట్లు ఉన్నాయని, వీటి ద్వారా ఈ ఆర్ధిక సంవత్సరం (2022-23) సుమారు రూ. 416. 50 కోట్లు అస్తి పన్నులు వసూలు అయిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నుపై వడ్డీ మాఫీ ప్రకటన ప్రకటించిన సందర్భంగా ప్రజలు, వివిధ సంస్థలు, తమ ఆస్తి పన్నులను భారీ స్థాయిలో కట్టారన్నారు.
జివిఎంసి గత ఆర్థిక సంవత్సరం (2022-23) రూ. 324. 24 కోట్లు వసూలు చేయడం జరిగిందని, ఈ ఆర్థిక సంవత్సరం రూ. 375 కోట్లు వసూలే లక్ష్యంగా నిర్దేశించామని, నగర మేయర్, జీవీఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు అదనపు కమిషనర్ (రెవెన్యూ), డిప్యూటీ కమిషనర్(రెవిన్యూ), జోనల్ కమిషనర్లు, రెవెన్యూ అధికారులు, రెవిన్యూ సిబ్బంది నిరంతరం కృషి ఫలితంగా శుక్రవారం రాత్రి 9 గంటల వరకు రూ. 416. 50 కోట్లు వసూలు అయిందని, రాత్రి 12 గంటలకు అన్ని సౌకర్య కేంద్రాలు పని చేస్తున్నందున ఈ వసూలు ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు.
సకాలంలో ఆస్తి పన్ను చెల్లించి విశాఖ నగరపాలక సంస్థకు తమ చేయూతనిచ్చి నగరాభివృద్ధికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే ఆస్తి పన్ను వసూలుకు సహకారం అందించిన ప్రజాప్రతినిధులు, డిప్యూటీ మేయర్లు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఫ్లోర్ లీడర్లు, కార్పొరేటర్లు, జివిఎంసి అధికారులు, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలకు మీడియా ప్రతినిధులకు నగర మేయర్, జీవీఎంసీ కమిషనర్ కృతజ్ఞతలు తెలిపారు.