మూడు రాజధానులు వద్దే వద్దని ఉత్తరాంధ్ర ప్రజలు ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు చెప్పారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. గుంటూరులో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన ఆయన మాజీ మంత్రులు పుల్లారావు, కన్నా, తదితరులతో కన్నా నివాసంలోనే భేటీ అయ్యారు. అనంతరం గంటా మీడియాతో మాట్లాడుతూ.... ‘‘వైసీపీ నేతలే ఎమ్మెల్సీ ఎన్నికలు రెఫరెండం అని పేర్కొన్నారు. విశాఖ రాజధాని వద్దని ప్రజలు తీర్పు చెప్పారు. ఎన్నికల్లో ప్రభుత్వం ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ప్రజలు విజ్ఞతతో టీడీపీ అభ్యర్థి చిరంజీవిని గెలిపించారు. జనసేన, టీడీపీ కలిసి ప్రయాణం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు’’ అని అన్నారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... ‘‘అమరావతిలో 3రాజధానుల శిబిరాన్ని ప్రభుత్వమే నిర్వహిస్తోంది. బీజేపీ నేత సత్యకుమార్‌పై జరిగిన దాడి కూడా ప్రభుత్వమే చేయించింది’’ అని ఆరోపించారు. తాళ్ల వెంకటేశ్ యాదవ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.