ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 5 న నిర్వహించనున్న శ్రీ సీతారాముల కల్యాణానికి పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్. పి కే. కే. ఎన్ అన్బురాజన్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఆయన సోమవారం పోలీస్ సిబ్బంది ఏర్పాటుచేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వేడుక కావడం, పలువురు వి. ఐ. పిలు విచ్చేయనుండడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. కల్యాణానికి అధిక సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.
కళ్యాణం రోజున ట్రాఫిక్ ను మళ్లించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయాలన్నారు. ఆలయ పరిసరాలు, కల్యాణ వేదిక వద్ద సిసి టివిలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ముఖ్యమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలన్నారు. దర్శనం, అన్నప్రసాదాల పంపిణీ వద్ద తోపులాట లేకుండా బ్యారికేడ్లు, కల్యాణానికి వచ్చే భక్తులకు పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.