జగన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో నిర్వహిస్తున్న అధికార కార్యక్రమము గడప గడపకు మన ప్రభుత్వంతో నియోజకవర్గ ప్రజలకు ఏమి ఒరిగిందని, ఈ కార్యక్రమంతో ప్రజలు సాధించింది ఏముందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా ప్రశ్నించారు. మంగళవారం భట్టిప్రోలు లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుచూ ప్రభుత్వ కార్యక్రమం అంటూ వై. సీ. పీ. పార్టీ ప్రచార కార్యక్రమము నిర్వహిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమముతో గ్రామాలలో ప్రజలకు జరిగిందేమిటని ఆయన అన్నారు. ప్రజలు అడిగే కనీస మౌలిక సమస్యలకు పరిష్కారం చూపలేని పరిస్థితిలో శాసనసభ్యులున్నారని విమర్శించారు.
కొంతమేర సమస్యల పరిష్కారానికి పనులు మంజూరు చేసినా, డబ్బులు రావన్న కారణంతో పనులు చేయటానికి అధికార పార్టీ నాయకులే ముందుకు రాలేని పరిస్థితిలో రాష్ట్రం ఉందని, గ్రామాల పర్యటనలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఏవిధమైన ఆర్ధిక నిధులు మంజూరు చేయించలేని దీన స్థితిలో శాసనసభ్యులున్నారని, ఫలితంగా పర్యటనలలో ప్రజలు నిలదీస్తున్నారని అన్నారు. స్థానిక సమస్యలకు పరిష్కారం చూపలేని గడప గడపకు మన ప్రభుత్వం గురించి సోమవారం శాసనసభ్యులతో ముఖ్యమంత్రి జరిపిన సమీక్ష సమావేశంలో ఈ కార్యక్రమాన్ని తిరిగి కొనసాగించాలని చెప్పటం సిగ్గుచేటని తప్పుపట్టారు.