ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదని, ఏ ఒక్క వైసీపీ ఎమ్మెల్యేనూ వదులుకునేందుకు సిద్ధంగా లేనని సీఎం జగన్ ప్రకటించారు. నియోజకవర్గ నేతలతో సమావేశమైన అయన మాట్లాడుతూ.... సార్వత్రిక ఎన్నికలు గడువులోగా 12 నెలల్లో రానున్నాయని చెప్పారు. 60 మంది శాసనసభ్యులకు ఈసారి టికెట్ ఇవ్వడం లేదని.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో వైసీపీ డీలా పడిందని దుష్ప్రచారం చేస్తున్నారని.. ఎమ్మెల్యేలు బలంగా తిప్పికొట్టాలని పిలుపిచ్చారు. మంత్రివర్గ విస్తరణ కూడా చేయడం లేదన్నారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంపై సోమవారమిక్కడ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రాంతీయ సమన్వయకర్తలు, ముఖ్యనేతలతో ఆయన వర్క్‌షాప్ నిర్వహించారు. లోక్‌సభ, శాసనసభకు జమిలి ఎన్నికలు ఒకేసారి వస్తే విజయం వైసీపీదేనన్నారు. ‘గడప గడపకు’ కార్యక్రమం ఆగస్టుదాకా కొనసాగుతుందని చెప్పారు. సెప్టెంబరు నుంచి సచివాలయ కన్వీనర్లు, గ్రామసారథులతో సమీక్షలు కొనసాగుతాయన్నారు.