మన భారతీయులు...మరీ ముఖ్యంగా తెలుగు వారు అమెరికాలో రోడ్డు ప్రమాదాలకు గురై మరణిస్తున్నారు. అమెరికాలో ఓ తెలుగు వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఏపీకి చెందిన విశ్వచంద్ కొల్లా బోస్టన్ ఎయిర్ పోర్టు వద్ద బస్సు ఢీకొని మృతి చెందాడు. మార్చి 28న ఈ ఘటన జరిగింది. బోస్టన్ లోని లోగాన్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఓ సంగీతకారుడి కోసం విశ్వచంద్ వేచి ఉండగా, ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. విశ్వచంద్ కొల్లా వయసు 47 సంవత్సరాలు. అమెరికాలోని తకేడా ఫార్మాస్యూటికల్ కంపెనీలో డేటా అనలిస్ట్ గా పనిచేస్తున్నాడు. ప్రమాద ఘటనపై మసాచుసెట్స్ పోలీసులు వివరాలు తెలిపారు. ఓ స్నేహితుడి కోసం వేచి ఉన్న విశ్వచంద్ కొల్లాను బస్ ఢీకొట్టిందని, ప్రమాదం జరిగిన సమయంలో అతడు బి టెర్మినల్ లోయర్ లెవల్ లో ఉన్నాడని వెల్లడించారు. తన ఆక్యురా వాహనం డ్రైవర్ సీట్ వైపు నిల్చుని ఉండగా, అదే సమయంలో అటుగా డార్ట్ మౌత్ రవాణా సంస్థకు చెందిన బస్సు అతడిని ఢీకొట్టి కొద్ది దూరం ఈడ్చుకువెళ్లిందని వివరించారు. అక్కడే ఉన్న ఓ నర్సు వెంటనే అక్కడికి చేరుకోగా, విశ్వచంద్ అప్పటికే మృతి చెందాడు. కాగా ఆ బస్సుకు 54 ఏళ్ల మహిళ డ్రైవర్ గా వ్యవహరిస్తున్నట్టు గుర్తించారు. విశ్వచంద్ వివాహితుడు. అతడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అతడి కుటుంబాన్ని ఆదుకునే ఉద్దేశంతో బంధువులు గో ఫండ్ మీ పేజ్ ద్వారా 7.50 లక్షల డాలర్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.