ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం మీరట్ జిల్లా మాల్యానాలో 36 ఏళ్ల కిందట 72 మంది ముస్లింల ఊచకోత కేసులో మొత్తం 39 మంది నిందితులను స్థానిక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో 900 విచారణలు జరిపిన న్యాయస్థానం.. నిందితులే హత్యకు పాల్పడినట్టు సరైన ఆధారాలను ప్రాసిక్యూషన్ సమర్పించలేదని పేర్కొంటూ తీర్పు వెలువరించింది. మీరట్ అదనపు జిల్లా కౌన్సిల్ సచిన్ మోహన్ మాట్లాడుతూ.. 39 మంది నిందితులకు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ అవసరమైన సాక్ష్యాలను సమర్పించలేదని వారందరినీ అదనపు జిల్లా న్యాయమూర్తి లఖ్విందర్ సింగ్ సూద్ నిర్దోషులుగా ప్రకటించారని తెలిపారు.
36 ఏళ్ల కిందటి ఈ కేసులో మొత్తం 93 మంది నిందితుల్లో 23 మంది చనిపోగా.. మరో 31 మందిని ఇప్పటి వరకూ గుర్తించలేకపోయారు. మీరట్ జిల్లా మాల్యానాలో 1987 మే 23న మారణహోమం జరిగింది. ప్రావిన్షియల్ సాయుధ కాన్‌స్టాబులరీ భారీ బృందంతో పాటు వందలాది మంది స్థానికులు తుపాకులు, కత్తులతో మాల్యానాలోకి ప్రవేశించారు. లోపలి ఉన్నవారు ఎవరూ బయటకు పోకుండా ఆ ప్రాంతంలోని మొత్తం ఐదు ఎంట్రీ పాయింట్లను బ్లాక్ చేసి ఊచకోతకు తెగబడ్డారు. ఈ ఘటనలో 72 మంది ప్రాణాలు కోల్పోయారు.