చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర ద్రోహి, 14 ఏళ్ల పాటు ముఖ్య మంత్రి గా పనిచేసిన ఆయన ఉత్తరాంధ్ర ప్రజలకు ఏం చేశాడు? తమ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తూ ఉంటే వాటిని ఎక్కడికి అక్కడ అడ్డుకుంటు న్నది చంద్రబాబు నాయుడు కాదా? ఉత్తరాంధ్ర ప్రాంతానికి చేయాల్సిన ద్రోహం అంతా చేసి ఇప్పుడు నీతి వాక్యాలు పలకడానికి ఇక్కడికి వచ్చిన చంద్రబాబు నాయుడు ఈ ప్రాంత ప్రజలను ఇంకెంతకాలం మభ్యపెడతాడు? అంటూ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చంద్రబాబునాయుడు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ సర్క్యూట్ హౌస్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చాలాకాలంగా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని పట్టించుకోని చంద్రబాబు నాయుడు ఎన్నికలు వస్తున్నాయి అని చెప్పి సదస్సుల పేరుతో ఈ ప్రాంత ప్రజలను మళ్లీ మభ్యపెట్టడానికి వచ్చాడని అన్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తే దానికి అడ్డు తగిలాడు. ఇక్కడ స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మించాలనుకుంటే కోర్టు కేసులు వేసి దానిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు.
ఈ విధంగా ఉత్తరాంధ్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు వెన్న రాయడానికి వచ్చాడా? అని ఆయన ప్రశ్నించారు. తాజాగా చంద్రబాబు నాయుడు సామాజిక న్యాయం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. విజయవాడ నడిబొడ్డున 140 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. బాబు జగ్జీవన్ రామ్, పూలే విగ్రహాలు కూడా తమ ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఆయనకి ఎప్పుడైనా వచ్చిందా? అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తి సామాజిక న్యాయం గురించి మాకు నీతులు చెప్తారా? అని ఆయన ప్రశ్నించారు. దళితులుగా ఎవరైనా పుడతారా? అంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఇప్పటికి ఎవరు మర్చిపోలేదని ఆయన ఎప్పటికీ దళిత ద్రోహిగా మిగిలిపోతాడని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అణగారిన వర్గాలు, పేదల సంక్షేమానికి రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు తమ గుండెల్లో పెట్టుకున్నారని మంత్రి అమర్నాథ్ చెప్పారు.
చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి పలానాది చేశానని గర్వంగా చెప్పుకొనేది ఒకటేనా ఉందా? అని అమర్నాథ్ ప్రశ్నించారు. ఏమైనా అంటే హుదూద్ తుఫాన్ సమయంలో విశాఖ ప్రజలను తానే కాపాడాలని, తుఫాన్ ను తానే ఆపానని డబ్బా కొట్టుకునే చంద్రబాబు నాయుడుకి, తుఫాను మాటున విశాఖ కలెక్టరేట్ లోని రికార్డులన్నీ మాయం చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది కాదా? అని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నాలుగు వేల కోట్ల రూపాయల విలువైన భూమిని చంద్రబాబు నాయుడు, అతని అనుచరులు స్వాహా చేసుకుంటే తమ ప్రభుత్వం వాటితో స్వాధీనం చేసుకుందని, దీనిపై ప్రశ్నిస్తే ఆ భూమిని తాము సమాజ సేవ కోసం తీసుకున్నామని చంద్రబాబు నాయుడు చెప్పడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. అమరావతిలో ఎంత పెద్ద స్కామ్ జరిగిందో. విశాఖలో కూడా చంద్రబాబు నాయుడు అదే స్థాయిలో అనేక కుంభకోణాలకు పాల్పడ్డారని అమర్నాథ్ ఆరోపించారు.
విశాఖలో జరిగిన పార్టీ సదస్సులో చంద్రబాబు నాయుడు దొంగల ముఠా అంతా కలిసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయాన్ని వాళ్ళు వాపును చూసి బలుపు అనుకుంటున్నారని, కనీసం కుప్పం నియోజకవర్గంలో గెలిచే ధైర్యం చంద్రబాబుకు ఉందా? ఆయన ప్రశ్నించారు? తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల దగ్గర నుంచి జమిలి ఎన్నికలు వస్తాయని ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు, తాజాగా తాజాగా ముందస్తు ఎన్నికల కోసం ముచ్చట పడుతున్నాడని, ఎన్నికల్లో ఓడిపోవడానికి ఆయన తహతహలాడుతున్నాడని అమర్నాథ్ ఎద్దేవా చేశారు.
175 సీట్లకు ఒంటరిగా పోటీ చేస్తామని చంద్రబాబు నాయుడుని చెప్పమని తాము పదే పదే అడుగుతున్నా ఎందుకు బదులివ్వడం లేదు? ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉండి, ఓట్లన్నీ తమ పార్టీకే పడతాయి అన్న ధైర్యం ఉంటే తాము అడిగిన ప్రశ్నకు బాబు సమాధానం చెప్పి ఉండేవాడని రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదని తెలిసి చంద్రబాబునాయుడు 175 సీట్లకు ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పలేకపోతున్నాడని అమర్నాథ్ విశ్లేషించారు. తమ ప్రభుత్వం ఐదేళ్లపాటు పూర్తిగా పాలిస్తుందని స్పష్టం చేశారు. పార్టీ 175 స్థానాలకు ఒంటరిగా పోటీ చేస్తుందని, ఆ సత్తా తెలుగుదేశం పార్టీకి ఉందా? అని అమర్నాథ్ మరోసారి ప్రశ్నించారు.
కులాలు, మతాలతో రాజకీయం చేసే చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో గెలుపు కోసం ఎన్ని కుట్రలనైనా పన్నుతాడని ఆయన అన్నారు. ముద్రగడని కొట్టిస్తాడు, వంగవీటిని చంపిస్తాడు. తిరిగి కాపులతో పొత్తు పెట్టుకోవడానికి వెంపర్లాడుతుంటాడు. నీచమైన రాజకీయాలకు చంద్రబాబు నాయుడు కేరాఫ్ అడ్రస్ అనేది జగమెరిగిన సత్యం అని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అర్థమైందని అన్నారు.