రైల్ మదత్ ద్వారా ఆర్‌పిఎఫ్ అప్రమత్తంతో 15 లక్షల విలువైన ఆభరణాలను తిరిగి పొందడం జరిగిందని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎ కె త్రిపాఠి గురువారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ నెల 5న రైలు నెంబర్ 17243లో తోటి ప్రయాణికుల బ్యాగ్ మార్పిడికి గురైందని రైల్‌మదత్ ద్వారా రైల్వే అధికారులకి ఫిర్యాదు అందింది. దీంతో విశాఖపట్నంలోని ఆర్‌పిఎఫ్ ను రైల్వే అధికారులు అప్రమత్తం చేశారు. తక్షణం విధుల్లో ఉన్న డ్యూటీ షిఫ్ట్ అధికారి ఎ ఎస్ ఐ కె అనంత్ రావు వివరాలు సేకరించి ప్రబల్ అప్లికేషన్ ద్వారా తోటి ప్రయాణికుల వివరాలను పొందాడు.
వారికి ఫోన్ చేయగా రెండు బ్యాగ్‌లు ఒకే రంగులో ఉన్నందున తన తల్లి పొరపాటున కో-ప్యాసింజర్ బ్యాగ్‌తో దిగిందని ఆమె కొడుకు శ్రీనివాస్ పేర్కొన్నాడు. ప్రయాణికులిద్దరూ రాజీపడి విశాఖపట్నంలో ఒకరినొకరు కలుసుకుని ఎలాంటి సమస్య లేకుండా బ్యాగులు మార్చుకున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఫిర్యాదుదారు బ్యాగ్‌లో రూ. 15 లక్షల విలువైన 280 గ్రాముల బంగారు ఆభరణాలు, బట్టలు ఉన్నాయని. ఈ విషయంలో త్వరితగతిన స్పందించిన ఆర్ పి ఎఫ్ విభాగాన్ని ఫిర్యాదిదారుడు అభినందించారు.