బీజీ-2 రకం పత్తి విత్తనాల ధరలను పెంపుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్యాకెట్‌కు రూ.43 చొప్పున పెంచడంపై రైతుల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతులకు అండగా ఉండి విత్తనాల ధరలు తగ్గించడానికి బదులుగా కేంద్రం వ్యాపారుల కొమ్ముకాస్తోందని శాస్త్రవేత్తలు, రైతు సంఘాల నేతలు ధ్వజమెత్తుతున్నారు. రెండున్నర దశాబ్దాల క్రితం పత్తిలో పురుగుల మందు చల్లకుండా చీడపీడలను తట్టుకొనే విత్తనాలను మోన్‌శాంటో కంపెనీ మార్కెట్‌లోకి తెచ్చింది. మొదట్లో 450 గ్రాముల ప్యాకెట్‌ను రూ.1,500- 2వేల వరకూ అమ్మారు. ఆ తరువాత గత ప్రభుత్వాల జోక్యం తో వీటి ధర రూ.600- రూ.700కు తగ్గింది. 2020కి రాయల్టీ సమయం పూర్తయింది. ప్రస్తుతం బీజీ పత్తి విత్తనాలను ఉ త్పత్తిచేసే కంపెనీలు మోన్‌శాంటోకి రాయల్టీ చెల్లించనందున రైతులకు తక్కువ ధరకే విత్తనాలను సరఫరా చేయాలి. అయి తే కంపెనీలు, ప్రభుత్వాలు ‘రివర్స్’గా వ్యవ హరిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 2017 నుంచి రైతులు ఉపయోగించని బీజీ-1 విత్తనాల ప్యాకెట్ ధర రూ.635గానే ఉంది. పత్తిలో 90శాతం వినియోగంలో ఉన్న బీజీ-2 విత్తనాల ప్యాకెట్ 2017లో రూ.800 ఉండగా, 2018లో రూ.740, 2019, 2020లలో రూ.730గా కేంద్రం ధరను నిర్ధారించింది. రాయల్టీ గడువు ముగిసిన తర్వాత నుంచి 2021లో రూ.47 చొప్పున, 2022లో రూ.43 చొప్పున, 2023లో రూ.43 చొప్పున ధరను పెంచారు.