ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను చైతన్యపరిచి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు తెదేపా శ్రేణులు సన్నద్ధం కావాలని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పిలుపునిచ్చారు. నరసన్నపేట సమీపంలోని ఓ కల్యాణ మండపంలో ఆదివారం జరిగిన శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిలీ ఓటర్లను గుర్తించడం, ఓటర్ల జాబితాల్లో తప్పులు సేకరించాలని తెదేపా శ్రేణులను ఆయన కోరారు. ప్రజా వ్యతిరేక పాలనపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. నరసన్నపేట నియోజకవర్గంలో పార్టీ తరపున చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించినందుకు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ప్రశంసించారని తెలిపారు. రాష్ట్ర పరిశీలకులు విమలారాణి, సంతోష్ కుమార్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.