రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వాగ్దానం ప్రకారం సంపూర్ణ మధ్యపాన నిషేధం దశలవారీగా అమలుచేస్తామని చెప్పి నాలుగు సంవత్సరాలైనా అమలు చేయలేదని, మహిళలను మోసగించారని, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం అన్నమయ్య జిల్లా కన్వీనర్ ఎం. భాగ్యమ్మ, జిల్లా నాయకురాలు యదురూరి. సుజాతమ్మ విమర్శించారు. మంగళవారం రైల్వే కోడూరులో జరిగిన మహిళా సంఘం సమావేశంలో మాట్లాడుతూ మద్యం మహిళలు తాగకపోయినా, మగవారు తాగడం వలన మహిళలే కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కష్టపడి సంపాదించిన డబ్బు ఖర్చు కావడమే కాక, ఆరోగ్యం నష్టం జరుగుతుందని, విచక్షణ కోల్పోవడం, భార్యా పిల్లలుపై హింస జరుగుతుందని తెలిపారు. మహిళలపై అత్యాచారాలు, లైంగికవేధింపులు, పెరిగిపోయాయి అన్నారు. నిర్భయ, దిశా చట్టాలు సక్రమంగా అమలు జరగడం లేదన్నారు. సంపూర్ణ మధ్య నిషేధం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు స్వర్ణలత, ప్రధాన కార్యదర్శి లలిత, ఉపాధ్యక్షులు జ్యోతి, సహాయ కార్యదర్శి జయలక్ష్మి పాల్గొన్నారు.