చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయంలోని మూల విరాట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దుమారం రేగుతోంది. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు సతీసమేతంగా రెండు రోజుల క్రితం ఆలయానికి వెళ్లారు. స్వామివారిని దర్శించుకున్న సమయంలో.. వారి అనుచరుడు గర్భాలయం ఫోటో తీశాడు. సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ కావడంతో విమర్శలు వస్తున్నాయి. ఆలయంలో రాజగోపురం నుంచి అర్ధ మండపం వరకు సెక్యూరిటీ సిబ్బంది, ఆలయ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అలాంటప్పుడు గర్భాలయం ఫోటో తీస్తుంటే ఏం చేస్తున్నట్లు అని విమర్శలు వినిపిస్తున్నాయి.
కాణిపాకం ఆలయం కూడా కొంతకాలంగా వరుస వివాదాల్లో ఉంటోంది. గత ఆరు నెలల కాలంలో ప్రధాన ఆలయం, అనుబంధాలయాల్లో పని చేసే నలుగురు అర్చకులు, ఒక టెంపుల్ ఇన్స్పెక్టర్, ఆరుగురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వేర్వేరు కారణాలతో సస్పెండ్ అయ్యారు. న్షన్ అలాగే పలువురిపై పోలీస్ కేసులు సైతం నమోదయ్యాయి. అంతేకాదు ఇటీవల ఆలయంలో అన్నప్రసాదంకు సంబంధించి సామాగ్రి చోరీ కావడం కలకలంరేపింది.
దీంతో ఆలయ ఈవో ఆధ్వర్యంలో సిబ్బంది ఇళ్లలో తనిఖీలు చేశారు. ఈ క్రమంలో గౌడౌన్, అన్నదాన సత్రం, ఆలయ పోటులో పనిచేసే మొత్తం ఏడుగురు సిబ్బంది ఇళ్లలో సరకులు ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే కృష్ణమోహన్ అనే అర్చకుడి ఇంట్లో జింక చర్మం దొరికింది. ఈ ఘటన కూడా వివాదాస్పదం అయ్యింది. ఈ ఘటనలో కూడా దర్యాప్తు జరుగుతోంది. అంతేకాదు గతంలోనూ కాణిపాకం ఆలయంలో బంగారు విభూతి పట్టీ కూడా మాయమైంది. ఓ భక్తురాలు పట్టీని విరాళంగా ఇవ్వగా.. గతేడాది ఆగస్టు 21న స్వామివారికి అలంకరించారు. ఆ తర్వాత పట్టీ మాయం కావడం కలకలంరేపింది. ఇలా ఆలయంలో రోజుకో వివాదంతో విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మూల విరాట్ ఫోటో ఎపిసోడ్‌పైనా విమర్శలు మొదలయ్యాయి. ఈ ఘటనపై ఆలయ అధికారులు స్పందించాల్సి ఉంది.