జగన్ లో ఉన్న ఫోకస్.. పవన్ కల్యాణ్‌లో లేదని నటుడు శివాజీ అన్నారు. పార్టీలను నమ్ముకుని రాజకీయం చేయడం వల్లే ఆయన సీఎం కాలేకపోతున్నారని.. ప్రజల్ని నమ్ముకుంటే కచ్చితంగా సీఎం అవుతారని జోస్యం చెప్పారు. కానీ ఆయన అలాంటి పని చేస్తారనే నమ్మకం లేదని అన్నారు. ఓ ఇంటర్వ్యూలో శివాజీ మాట్లాడుతూ.. ‘‘జనసేనకు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. వాళ్లకి ఉండే ఓటు బేస్ వాళ్లకి ఉంది. పవన్ కల్యాణ్ ఒక శక్తి.. అతను అనుకుంటే అయిపోతుంది. కానీ ఏదీ అనుకోడు. ప్రత్యేక హోదా అవుతుంది.. అమరావతి అవుతుంది.. విశాఖ ఉక్కు అవుతుంది. కానీ ఆయన అనుకోడు.. ఎందుకు అనుకోడో నాకు అర్ధం కాదు’’ అని శివాజీ విమర్శలు చేశారు.
పవన్ రోడ్డుపైకి వస్తే పార్టీలకు అతీతంగా వచ్చి ఆయనకి మద్దతు ఇచ్చేవాళ్లు చాలామంది ఉన్నారని చెప్పారు. ‘‘నాకు జనసేనలో చేరాలని, ఆయనతో ఉండాలనేం లేదు. మన దగ్గర అస్త్రం ఉన్నప్పుడు.. దాన్ని కరెక్ట్‌గా సంధిస్తే దాని పవర్ ఏంటో తెలుస్తుంది. కరెక్ట్ ప్లేస్‌లో కరెక్ట్ టైంలో సంధించడం లేదనేదే నా బాధ’’ అన్నారు. ‘‘బీజేపీతో కలవడం అనేది పవన్ ఇష్టం. నా అభిప్రాయం ఏంటంటే.. పవన్ కల్యాణ్ అనే వ్యక్తి ఒక శక్తిగా పార్టీలను నమ్ముకునే కంటే ప్రజల పక్షాన నిలబడి, సమస్యల్ని నమ్ముకుని ఫైట్ చేస్తే రిజల్ట్ మరోలా ఉంటుంది’’ అని చెప్పుకొచ్చారు.
‘‘వైఎస్ జగన్.. వెరీ ఫోకస్డ్ పొలిటీషియన్. ఫోకస్ పెట్టాడంటే అనుకున్నది సాధిస్తాడు. అదే ఫోకస్ పవన్ కల్యాణ్ పెట్టడం లేదు.. ఇద్దరికీ అదే తేడా’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘జగన్, మోదీతో నాకేం ఫ్యాక్షన్ గొడవలు లేవు. నాకేం పోలీస్ ఉద్యోగం ఇవ్వలేదు వాళ్లపై నిఘాపెట్టడానికి. సమాజం బాగుండాలనే నా తాపత్రయం అంతా’’ అని వ్యాఖ్యానించారు.