చంద్రబాబు జిత్తులమారి నక్క అని, గుడివాడకు ఆయన చేసిందేమీ లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు. ఆయనో 420 అని, అలాంటి వ్యక్తి గురించి అంబేద్కర్ జయంతి రోజున మాట్లాడటం సరికాదన్నారు.
ఈ రోజు మీడియాతో కొడాలి నాని మాట్లాడుతూ.. ‘‘1999లో చంద్రబాబు సీఎంగా వచ్చి ఇక్కడ పోటీ చేయాలని చెబితే అభ్యర్ధి ఓడిపోయారు. దేవుడి దయవల్ల 2004, 2009లో నన్ను గెలిపించాలని చంద్రబాబు అనలేదు కాబట్టి నేను గెలిచాను. 2014, 2019లలో వచ్చి టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరితే ఓడించారు’’ అని చెప్పారు. గుడివాడలో చంద్రబాబు ప్రచారం చేసిన ప్రతిసారి టీడీపీ ఓడిపోయిందన్నారు.
‘‘గతంలో రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు జగన్ కలిసి పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు 400 ఎకరాలు సేకరించారు. గుడివాడలో 23 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. మరి గుడివాడలో పేదల ఇళ్ల కోసం ఒక్క ఎకరం అయినా టీడీపీ అధినేత చంద్రబాబు కొన్నారా? చంద్రబాబు ఒక్క ఎకరం కొన్నా రాజకీయాలు వదిలేస్తా’’ అని కొడాలి నాని సవాల్ విసిరారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి గుడ్డి గుర్రాలకు పళ్లు తోమావా అని మండిపడ్డారు.
కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలకు మద్దతు పలికిన చంద్రబాబు.. గుడివాడలో ఎందుకు ఫ్లై ఓవర్లు కట్టలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘గుడివాడ ఎన్టీఆర్ పుట్టిన గడ్డ అని చంద్రబాబు ఇప్పుడు దొంగ ప్రేమ ఒలక పోస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో ఫ్లై ఓవర్లు, రోడ్లు, పేదలకు ఇళ్లను కడుతూ మేం అభివృద్ధి చేస్తున్నాం. నిమ్మకూరు వెళ్తే చంద్రబాబుకు ఉండటానికి ఎవరూ ఇల్లు కూడా ఇవ్వలేదు. అందుకే బస్సులో పడుకున్నాడు. పెళ్లి అయిన 42 ఏళ్లకు అత్తగారి ఊరికి వెళ్లిన చంద్రబాబుకు సిగ్గు ఉందా?’’ అని ప్రశ్నించారు.
‘‘నిమ్మకూరులో ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలను కట్టించింది నేను, జూనియర్ ఎన్టీఆర్. 60 లక్షలు వెచ్చించి 2003లో ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలు ఏర్పాటు చేశాం. హరికృష్ణ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు రూ.14 కోట్లు ఖర్చు పెట్టి నిమ్నకూరును అభివృద్ధి చేశారు. నిమ్మకూరుపై ప్రేమ ఉన్నది పెద్ద ఎన్టీఆర్, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లకు మాత్రమే. నిమ్మకూరులో జూనియర్ ఎన్టీఆర్‌కు తప్ప ఎవరికీ ఆస్తులు లేవు. అందరూ అమ్ముకుని పోయారు’’ అని పేర్కొన్నారు.