రాష్ట్ర ఆర్థికశాఖ సక్రమంగా నిధులు విడుదల చేయకుండా నేషనల్ హెల్త్ మిషన్ విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ధ్వంసం చేస్తూ కేంద్రంపైకి నెపం నెట్టి ఎన్‌హెచ్‌ఎంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలిచ్చే 010 పద్దును నిలిపివేసింది అని టీడీపీ నాయకులూ ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఈ నిర్ణయంతో మార్చితో పాటు ఏప్రిల్‌లో కూడా కేంద్ర ప్రాయోజిత పథకాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు జీతాలు వచ్చే పరిస్థితి లేదు. వీరంతా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులైనప్పటికీ వారికి జీతాలు మొత్తం కేంద్రమే విడుదల చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం వారికి ప్రతినెలా జీతాలు చెల్లించిన తర్వాత... కేంద్ర ప్రభుత్వం ఒకేసారి రీయింబర్స్‌మెంట్ చేస్తుంది. ఇది గత కొన్నేళ్లుగా నడుస్తున్న విధానమే. అయితే ఉద్యోగుల జీతాలకు సంబంధించిన నిధుల విడుదలలో కేంద్రం ఆలస్యం చేస్తోందని, రీయింబర్స్‌మెంట్ సక్రమంగా చేయడం లేదని ఇప్పుడు ఆర్థిక శాఖాధికారులు అడ్డగోలు వాదనను తెరపైకి తీసుకువచ్చారు. అందువల్లే 010 పద్దును రద్దుచేసి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద జీతాలు చెల్లించే విధానాన్ని తెచ్చామంటున్నారు.